చిత్ర పరిశ్రమలో కాపీ, దోపిడీ, మోసం అనేది సర్వ సాధారణం. ఏళ్లుగా రాసుకున్న కథ, ఎదురుచూసిన పాత్ర, దాచుకున్న సొమ్ము ఎవరైనా దోచేయ వచ్చు. ఇతరుల శ్రమను,క్రియేటివిటీని దోచుకొని సొమ్ము చేసుకొని బ్రతికేసే వారు ఎందరో ఉన్నారు. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే…రెండు రోజుల క్రితం రాజ్ అనే ఓ దర్శకుడు దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ ప్రస్థానం మొదలు, వారి స్నేహం, తరువాత ఏర్పడిన వైరం ఆధారంగా ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి నిర్మాతలుగా ఎన్టీఆర్ బయోపిక్స్ తెరకెక్కించిన విష్ణు ఇందుకూరి మరియు తిరుమల రెడ్డి ఉన్నారు. ఈ మూవీ ప్రకటన రోజే ప్రస్థానం ఫేమ్ దర్శకుడు దేవా కట్టా రియాక్ట్ అయ్యారు. ఇదే నేపథ్యంలో తను 2017లోనే ఓ కథను సిద్ధం చేసి కాపీ రైట్స్ క్రింద రిజిస్టర్ చేయించాను అన్నారు. అలాగే ఆ కథకు అనేక వెర్షన్స్ రాసి, అవి కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది అన్నారు.
ఒక వేళ దర్శకుడు రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో తన కథలోని థీమ్స్, కానీ సన్నివేశాలు కానీ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అన్నారు. దాని వలన ఒరిగింది ఏమి లేదనుకున్నారేమో నేడు అదే కాన్సెప్ట్ తో ఇంద్ర ప్రస్థం పేరుతో మూవీ ప్రకటించారు. కాపీని ఆపలేమనే భయంతోనే దేవా కట్టా మూవీ ప్రకటించారు అనిపిస్తుంది.