సిరివెన్నెల పాటల్లో అందం ఎంత ఉంటుందో, అంతగా ఆవేశమూ ఉంటుంది. సమాజంలోని అందాన్ని వర్ణించే ఆయన అక్షరాలు, అవసరమైతే సమాజంపై తిరగబడేలా కూడా చేస్తాయి. అలా ఉంటుంది మరి ఆ ప్రభావం వ్యక్తుల మీద. అలాంటి వ్యక్తి ఓ విషయంపై నేరుగా పోరాటం చేస్తే… ఆ ప్రభావం ఇంకెంతగా ఉంటుందో ఊహించుకోండి. సిరివెన్నెల రచయితల గురించి చేసిన పోరాటం గురించి చెప్పడానికే ఇదంతా. పాటల రచయితల హక్కుల కోసం సిరివెన్నెల ఎంతో శ్రమించారు.
నిర్మాతలు, ఆడియో కంపెనీ అధిపతులతో ఈ విషయమై చాలాసార్లు మాట్లాడారు. గీత రచయితల గుర్తింపు, రావాల్సిన రాయల్టీ కోసం ఆయన కృషి చేశారు. దానికి సంబంధించిన చట్టాలు చదివి లోతుగా అధ్యయనం చేశారు. రచయితల కోసం నిబంధనలు ఏర్పాటు చేసి మరీ రచయిత హక్కుల కోసం కృషి చేశారు. ఎవరో ఒకరు.. ఎపుడో.. అపుడు… అంటూ ఓ సినిమాలో పాట రాసిన సిరివెన్నెల… రచయితల హక్కులు, రాయల్టీ కోసం అన్నీ ఆయనై నడిపించారు.
ఆయన రాసిందే చేస్తారు… చేసేదే రాస్తారు…. అందుకే ఆయన ఆదర్శకవి అని అభివర్ణించారు ప్రముఖ గీత రచయిత చంద్రబోస్. ఇలా చెప్పుకుంటూ పోతే సిరివెన్నెల గురించి ఎన్నెన్ని విషయాలో.