వేటూరి సుందరరామ్మూర్తి తర్వాత అదే స్థాయిలో తెలుగు పాటకు ప్రాణం పోసిన పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు తెచ్చుకున్నారు. సిరివెన్నెల సినిమాలో పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సీతారామశాస్త్రి ఆ సినిమానే ఇంటిపేరుగా పెట్టుకున్నారు. 30 సంవత్సరాల సినీ కెరీర్ లో 3000కు పైగా పాటలను సిరివెన్నెల రాశారు. ఆయన పాటలలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఉన్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో సిరివెన్నెల మాట్లాడుతూ ఎక్కడైతే మాట మూగబోతుందో అక్కడే పాట మొదలవుతుందని
నా పాటలలో ఎప్పుడూ పాటను ఆస్వాదించే వాళ్ల భావాలు కనిపించాలే తప్ప పాట కనిపించకూడదని కోరుకుంటానని సిరివెన్నెల చెప్పుకొచ్చారు. ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటనే ప్రశ్నకు స్పందిస్తూ పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటులేదని సిరివెన్నెల వెల్లడించారు. తన పాటల్లో గర్వించే పాట ప్రతి పాట అని ఆయన చెప్పారు. తానేం చెబుతున్నాడో ఎందుకు చెబుతున్నాడో తనకు స్పష్టంగా తెలియడం రచయితకు ఉండాల్సిన ప్రథమ లక్షణమని సిరివెన్నెల అన్నారు.
లిరిక్స్ రాయడానికి ఫేవరెట్ స్థలం తన బుర్రలోని అలజడి అని సిరివెన్నెల తెలిపారు. యూత్ అనేది ఏజ్ కాదని ఫేజ్ అని అది తెలుసుకుంటే యూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్ అని సిరివెన్నెల పేర్కొన్నారు. భగవద్గీత, ద ప్రాఫెట్ తనకు ఇష్టమైన పుస్తకాలు అని సిరివెన్నెల చెప్పుకొచ్చారు. తాను పాటల రచయిత కాకపోతే జరగాల్సిందే జరిగిందని జరగాల్సిందే జరుగుతోందని సిరివెన్నెల సీతారామశాస్త్రి పేర్కొన్నారు. గతంలో సిరివెన్నెల చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.