నిద్ర లేచిన దగ్గర్నుండీ తిరిగి నిద్ర పోయే వరకూ.. ప్రతీ ఒక్కరూ నూతన ఉత్సాహం పొందేది పాటలు వింటూనే.. అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు ఆ పాట ఏడుస్తున్న రోజని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆ పాటకే ప్రాణం పోసే లెజెండరీ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈరోజు మరణించారు. దీంతో యావత్ సినీ ప్రేమికులు.. సంగీత ప్రియులు దిగ్బ్రాంతికి గురయ్యారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పట్లో ఆయన రికార్డుని మరెవ్వరూ బ్రేక్ చెయ్యలేరు అనడంలో కూడా అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉండగా.. కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు స్టార్ నటులకు వారి పాత్రల హావభావాలు తగినట్టు డబ్బింగ్ చెప్పి.. ఆ సినిమాలు విజయం సాధించడానికి కూడా దోహద పడిన కళాకారుడు మన ఎస్.పి.బి. ముఖ్యంగా ఈయన రెండు సినిమాలకు ప్రాణం పోసాడని చెప్పాలి. అందులో ఒకటి కమల్ హాసన్ ‘దశావతారం’ కాగా మరొకటి మహేష్ బాబు ‘అతడు’ చిత్రం. ‘దశావతారం’ చిత్రంలో కమల్ హాసన్ 10 విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఆ 10 పాత్రలకు డబ్బింగ్ చెప్పి.. ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించారు బాల సుబ్రహ్మణ్యం. మరీ ముఖ్యంగా ఆ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రకు అలాగే పొడుగ్గా ఉండే కమల్ హాసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి మన బాలు గారు చాలా కష్టపడ్డారట.
ఈ చిత్రంతో పాటు మహేష్ బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అతడు’ చిత్రంలో సత్యనారాయణ మూర్తి(పార్థు తాత) పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా మన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యమే. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి కూడా బాలుగారు చాలా కష్టపడ్డారట. కానీ చాలా ఇష్టంతోనే కష్టపడినట్టు కూడా చెప్పుకొచ్చారు. మనవడి పై ప్రేమ ఒకవైపు ముసలాడి చాదస్తం మరో వైపు.. మెయిన్టైన్ చేస్తూ డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ రెండు సినిమాలు తనకి చాలా ప్రత్యేకమని కూడా తెలిపారు బాలు.