టాలీవుడ్‌లో విలన్లు అంటే ఇప్పుడు స్టార్ హీరోలు, కుర్ర హీరోలు కూడా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం విలన్లు అంటే అదో సెపరేట్ కేటగిరి. అందులో ఉన్న నటుల నుండే కొత్త సినిమాలకు విలన్లను తీసుకునేవారు. లేదంటే కొత్తవారిని ఆ జాబితాలో యాడ్ చేసేవారు. అలాంటి సమయంలో స్టార్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు చరణ్‌రాజ్. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్ అర్టిస్ట్ పాత్రలు కూడా చేశారు అనుకోండి. ఆ చరణ్ రాజ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘ప్రతిఘటన’, ‘స్వయం కృషి’, ‘హలో బ్రదర్’ లాంటి సినిమాలతో చరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు. ఆ తర్వాత ఆయన చాలా రోజలుగా గ్యాప్ ఇచ్చారు. ఇన్నాళ్లకు ‘నరకాసుర’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. రక్షిత్ అట్లూరి హీరోగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా నవంబరు 3న విడుదలవుతున్న నేపథ్యంలో చరణ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలోకి రావడానికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదని చెప్పిన ఆయన ఇంకొన్ని విషయాలు తెలిపారు.
నటుడిగా వెండితెర మీద కనిపించడానికి ఎనిమిదేళ్లు అర్ధాకలితో కష్టపడ్డానని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఆ కష్టానికి ఫలితమే తన 40 ఏళ్ల కెరీర్ అని చెప్పుకొచ్చారాయన. అలా ఇప్పటివరకు వివిధ భాషల్లో 600కుపైగా చిత్రాల్లో నటించానని చెప్పారు చరణ్ రాజ్. మధ్యలో తెలుగు నుంచి చాలా ఆఫర్లు వచ్చినా గతంలో చేసేసిన పాత్రల తరహాలోనే ఉండటంతో నో చెప్పానని తెలిపారు. అందుకే తెలుగులో పదేళ్ల విరామం వచ్చింది అని చెప్పారు.
‘నరకాసుర’ సినిమా గురించి చెబుతూ.. దర్శకుడు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు తన పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగా నచ్చిందని, అందుకే వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పాను అని తెలిపారు చరణ్ రాజ్. అన్నట్లు ఈ సినిమాలో (Charan Raj) చరణ్‌రాజ్‌తోపాటు ఆయన పెద్ద కొడుకు కూడా నటించాడట.