జనవరి 6వ తారీఖున నిజామాబాద్ లో “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunnam) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కడ వెంకీ చేసిన అల్లరి సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోయింది. ఆ ఈవెంట్ తో సినిమా మరింతమందికి చేరువైందని చెప్పాలి. అంత సక్సెస్ ఫుల్ గా జరిగిన ఆ ఈవెంట్లో ఒక ఊహించని అపశృతి దొర్లింది. ఈవెంట్ కి హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) .. చిత్ర నిర్మాతలైన దిల్ రాజు(Dil Raju) , శిరీష్ లను (Shirish) పొగిడే ఉపోద్ఘాతంలో పొరపాటున “రామలక్ష్మణులు ఫిక్షనల్, దిల్ రాజు, శిరీష్ లు ఒరిజినల్” అనేసింది.
అంతే ఒక్కసారిగా హిందూ సంఘాలన్నీ శ్రీముఖి మీద విరుచుకుపడ్డాయి. నిన్నటినుంచి సోషల్ మీడియా మొత్తం శ్రీముఖిని తిట్టిపోశారు. అసలు రామలక్ష్మణులను కల్పితం అనడానికి నువ్వెవరు? అలా ఎలా అనగలిగావ్? అంటూ ఆమెను ఒక ఆటాడుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉందని గ్రహించిన శ్రీముఖి ఇవాళ (జనవరి 8) తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తాను అనుకోకుండా చేసిన తప్పుకు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
“ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ అన్నాను. నేను కూడా హిందువునే, రాముడ్ని కొలుస్తాను. నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దయచేసి క్షమించండి” అంటూ ఈ శ్రీముఖి చేతులెత్తి క్షమాపణలు చెప్పింది కాబట్టి హిందూ సంఘాలు ఇకనైనా ఆమెపై సోషల్ మీడియాలో దాడికి తెర దింపుతాయో లేదో చూడాలి.