సరిగ్గా ఓ పది నెలల క్రితం శ్రీరెడ్డికి తాను సినిమా అవకాశం ఇస్తున్నానని, ఆమెకు అండగా కూడా నిలుస్తానని దర్శకుడు తేజ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదృష్టం అచ్చిరాక తేజ ఆ ప్రొజెక్ట్ నుంచి తప్పుకోవడంతో శ్రీరెడ్డికి ఆ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు కానీ.. లేదంటే మొన్న జనవరి 9న విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో ఏదో ఒక పాత్రలో శ్రీరెడ్డిని చూడాల్సి వచ్చేదేమో. అయితే.. క్రిష్ వెర్షన్ ఆఫ్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం కోల్పోయిన శ్రీరెడ్డి మరో వెర్షన్ లో అవకాశం దక్కించుకొందని తెలుస్తోంది.
కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి “లక్ష్మీస్ వీరగ్రంధం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పాత్రధారులు ఎవరనేది ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కానీ.. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిగా మాత్రం శ్రీరెడ్డి నటించిందని టాక్ వినబడుతోంది. ఈ విషయంలో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదేగనుక నిజమైతే.. సినిమా విడుదలను ఒరిజినల్ లక్ష్మీ పార్వతి అడ్డుకోవడంలో ఎలాంటి తప్పు ఉండదు. నిన్నమొన్నటివరకూ కేవలం కాంట్రవర్శియల్ స్టేట్మెంట్స్ వరకే పరిమితమైన ఈ చిత్రం శ్రీరెడ్డి ఎంట్రీతో ఇంకో మెట్టు ఎక్కింది. ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే.. శ్రీరెడ్డి రాకతో బోలెడంత పబ్లిసిటీ మాత్రం రాబట్టుకొంది. ఇకపోతే.. ఈ సినిమాలోని లక్ష్మీ పార్వతి పాత్రకు శ్రీరెడ్డిని రిఫర్ చేసింది డైరెక్టర్ తేజ అని టాక్.