సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందనున్న SSMB29 సినిమాపై అంచనాలు రోజురోజుకుమరింత పెరుగుతున్నాయి. రాజమౌళి కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా, హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా అడ్వెంచర్ థీమ్‌తో కొత్త ఒరవడి సృష్టించబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, మేకర్స్ అధికారిక ప్రకటన చేయకుండానే కీలక పనులను ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ కు సంబంధించి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
మొదట మహారాజ్, గరుడ వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చినా, రాజమౌళి కొత్తదాన్ని ట్రై చేయాలని భావించారని టాక్. ప్రస్తుతం ‘జనరేషన్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఓ గ్లోబల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబించేలా టైటిల్ ఉంచాలని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రకు ప్రాధాన్యత ఉందని టాక్.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పాటేకర్ (Nana Patekar) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మహేష్ తండ్రిగా నటిస్తున్నారా? లేక విలన్ పాత్రలో కనిపించనున్నారా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. నానా పాటేకర్ లాంటి అగ్ర నటుడు సినిమాలో భాగం కావడం, బాలీవుడ్ మార్కెట్‌ను మరింత స్ట్రాంగ్ చేయడంలో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎంపికైందని ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్ దృష్టిలో ఉంచుకుని ప్రియాంకను తీసుకున్నట్లు సమాచారం. మహేష్-ప్రియాంక ఇప్పటికే హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌లో పాల్గొన్నారని టాక్. ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్నారని, అందుకే రాజమౌళి పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.