త్రివిక్రమ్ నుండి కొత్త సినిమా వస్తోంది అంటే… అందులో హీరోకి తల్లిగా లేదంటే అత్తగా అలనాటి కథానాయిక ఉండాల్సిందే అంటారు. ఇటీవల సినిమాల్లో ఈ అనధికార సెంటిమెంట్‌ను త్రివిక్రమ్ పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మహేష్‌బాబు సినిమాలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ నాయిక ఈమే అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన పేరు బయటకు వచ్చింది.
డ్యాన్స్, యాక్టింగ్… ఇలా అన్నింటా ఆ రోజుల్లో మాస్ హీరోలకు సరిజోడి అనిపించుకున్న కథానాయిక రాధ. ఆమెనే ఇప్పుడు త్రివిక్రమ్ తీసుకొస్తున్నారని టాక్. ఇటీవల దీనికి సంబంధించిన చర్చలు కూడా సాగాయని సమాచారం. రాధ చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తన కుటుంబం మాత్రం సినిమాల్లోనే ఉంది. రాధ కుమార్తెలు కార్తిక, తులసి సినిమాల్లో కథానాయికలుగా నటించారు. అయితే తల్లికి తగ్గ తనయగా రాణించలేకపోయారు. ఆ విషయం పక్కపెడితే… ఇప్పుడు రాధ రీఎంట్రీ మహేష్ – త్రివిక్రమ్ సినిమాతోనే అని టాక్.
ఒకవేళ రాధ ఇప్పడు మహేష్ సినిమాలో నటిస్తే అప్పుడు వదిన, ఇప్పుడు తల్లిగా నటిస్తోంది అని చెప్పొచ్చు. మహేష్ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆయన ‘ముగ్గురు కొడుకులు’ అనే సినిమా చేశారు. అందులో కృష్ణ చిన్న తమ్ముడిగా మహేష్ కనిపిస్తాడు. ఆ సినిమాలో రాధ కృష్ణ సరసన నటించింది. ఆ లెక్కన అప్పుడు వదిన పాత్ర, ఇప్పుడు తల్లిపాత్ర అనుకోవచ్చు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన మహేష్ – త్రివిక్రమ్ సినిమా పూర్తిస్థాయి చిత్రీకరణ త్వరలో మొదలవుతుంది.
ఈ సినిమాలో మహేస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇంకో కథానాయికకూ సినిమాలో అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం యువ కథానాయికలతో చర్చలు జరుపుతున్నారు. అను ఇమ్మన్యుయేల్, సంయుక్త మీనన్, శ్రీలీల తదితరుల పేర్లు వినిపించాయి. మరి వీరిలో ఎవరైనా ఓకే అవుతారో, లేక కొత్త భామ వస్తుందో చూడాలి.