కొన్నిరోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా.. ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. ఆర్ధిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తాను కూడా వర్షాల కారణంగా భారీగా నష్టపోయినట్లు హిందీ టీవీ నటుడు కుశాల్ టాండన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రెస్టారెంట్ ధ్వంసమైందని.. సుమారు పాతిక లక్షల నష్టం వచ్చిందని పేర్కొన్నాడు.
కుశాల్ టాండన్ 2019లో ‘ఆర్బర్ 28’ పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించాడు. హార్థిక్ పాండ్య, సోహైల్ ఖాన్, సిద్ధార్థ్ శుక్ల, లులియా వంటూర్ వంటి సెలబ్రిటీలు ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు. అయితే కొన్నిరోజులు వ్యాపారం బాగానే జరిగినా.. కరోనా దెబ్బకు రెస్టారెంట్ ను మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రెస్టారెంట్ బిజినెస్ వర్షాల దాటికి మళ్లీ దెబ్బతింది. కోవిడ్ కారణంగా వ్యాపారంపై ఎఫెక్ట్ బాగా పడిందని..
రెండు సార్లు రెస్టారెంట్ ను మూసేయాల్సిన పరిస్థితి కలిగిందంటూ కుశాల్ స్వయంగా చెప్పుకొచ్చాడు.సడలింపులు ఉన్నా.. కస్టమర్లు ఎక్కువగా వచ్చేవారు కాదని.. ఇప్పుడేమో వర్షాల కారణంగా రెస్టారెంట్ బాగా డ్యామేజ్ అయిందని.. దాదాపు పాతిక లక్షల నష్టం వచ్చిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని వాపోయాడు.