నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న తెలుగు ప్రేక్షకాభిమానులను వదిలేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన లేరనే మాట అబద్ధం అయితే బాగుండు అనుకుంటున్నారంతా.. ఆయన కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎంఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సినిమాలను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది..
త్వరలో కృష్ణ చిత్రాలకు సంబంధించిన విశేషాలతో కృష్ణ మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు కుటుంబ సభ్యులు. కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచగా.. తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో సీనియర్ ఫ్యాన్స్ వచ్చారు. తమ అభిమాన కథానాయకుణ్ణి కడసారి చూసి కన్నీటి వీడ్కోలు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ ఫ్యాన్స్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
ఇప్పటికే సురేష్ అనే ఆర్టిస్ట్ అగ్గిపుల్ల మీద కృష్ణ బొమ్మ గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఓ అభిమాని ఏకంగా సూపర్ స్టార్ నటించిన 345 సినిమాల పేర్లతో ఆయన చిత్రపటాన్ని రూపొందించి ఘననివాళి అర్పించాడు. నంద్యాలకు చెందిన కోటేష్ ఆర్ట్స్ వారు చాలా చక్కగా కృష్ణ చిత్రపటాన్ని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. నవంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లో కృష్ణ దశ దిన కర్మను ఘనంగా ఏర్పాటు చేయనున్నారు కుటుంబ సభ్యులు..