దాదాపు 12 సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి సౌత్ ఇండియా అంతటా గుర్తింపును సంపాదించుకున్నారు సౌందర్య. సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా సినిమాల కోసం ఆమె తన పేరును మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నటి సౌందర్య అని ఆమెతో సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు ఇంటర్య్వూలలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. డాక్టర్ కావాల్సిన సౌందర్య వరుసగా సినీ ఆఫర్లు రావడంతో యాక్టర్ అయ్యారు.
స్టార్ హీరో వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ సౌందర్య గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమకు వేళాయరా సినిమాలో చక్రవర్తి, సౌందర్య జంటగా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.
చక్రవర్తి మాట్లాడుతూ ప్రేమకు వేళాయరా సినిమా షూటింగ్ సమయంలో తనకు, సౌందర్యకు విభేదాలు తలెత్తాయని.. ఆ విభేదాల వల్ల కొంతకాలం సౌందర్యకు, తనకు మధ్య మాటలు లేవని అన్నారు. అయితే కొన్ని నెలల తరువాత విభేదాలను మరిచిపోయి తాను, సౌందర్య ఫ్రెండ్స్ అయ్యామని చక్రవర్తి వెల్లడించారు. అయితే సౌందర్యకు డైరెక్షన్ చేయాలని కోరిక ఉండేదని.. డైరెక్షన్ చేయడానికి ఒక అద్భుతమైన కథను కూడా సౌందర్య సిద్ధం చేశారని.. కానీ డైరెక్షన్ చేయాలనే కోరిక తీరకుండానే సౌందర్య చనిపోయారని చక్రవర్తి అన్నారు.
నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించిన సౌందర్య దర్శకత్వం వహించాలనే కోరిక నెరవేరకుండానే 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన విమాన ప్రమాదంలో మృతి చెందారు. అభిమానులు సౌందర్యను జూనియర్ సావిత్రి అని పిలుచుకుంటారు. సౌందర్యకు నవరస నటనా మయూరి అనే బిరుదు కూడా ఉంది.