స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయల నుంచి మూడున్నర కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చిన్న సినిమాలకు మాత్రం పరిమితంగానే థమన్ రెమ్యునరేషన్ తీసుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన రాధేశ్యామ్ సినిమాకు మాత్రం థమన్ రూపాయి కూడా తీసుకోలేదు. స్వయంగా థమన్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. అఖండ బీజీఎంతో ప్రశంసలు అందుకున్న థమన్ కు ఆ సినిమా వల్ల రాధేశ్యామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం దక్కింది.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్ మూవీ తెరకెక్కగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి థమన్ మాట్లాడుతూ రాధేశ్యామ్ సినిమా రేంజ్ కు తాను సరిపోనని ఈ సినిమా గొప్ప ప్రేమకథా చిత్రమని ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.
యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నాపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు పని చేసే అవకాశం ఇచ్చారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని తాను భావిస్తున్నానని థమన్ అన్నారు. తాను కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు తనకు వరుసగా ఆఫర్లు ఇచ్చారని వారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని థమన్ వెల్లడించారు. థమన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
థమన్ తన కామెంట్లతో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారని చెప్పాలి. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.