ట్వీటుతోనే అయిపోయే దానికి… స్పందించకుండా అభిమానులను బాధపెట్టడం భావ్యమా… యూవీ క్రియేషన్స్ టీమ్‌ని ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఇదే మాట అడుగుతున్నారు. వాళ్లకు కావాల్సిందల్లా ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఎప్పుడు అని. అవును సంక్రాంతికి రావాల్సిన ‘రాధేశ్యామ్’ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న సినిమా వచ్చేస్తుంది అనుకుంటుండగా… ‘తూచ్.. మేం రాలేం, రాం’ అని చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త డేట్ కోసం అడుగుతున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో చిత్రబృందం ఇటీవల క్లారిటీ ఇచ్చింది. మార్చి 18, ఏప్రిల్ 29 అంటూ రెండు డేట్స్ ఇచ్చారు. పరిస్థితులు అనుకూలించి, థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే మార్చి 18న సినిమా తీసుకొస్తామని ప్రకటించారు. ఒకవేళ కుదరని పక్షంలో సినిమాను పక్కాగా ఏప్రిల్ 29 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పేశారు. దీంతో ఇప్పుడు ‘రాధేశ్యామ్’ వైపే అందరి వేళ్లూ, చూపులు పడ్డాయి. ఎప్పుడు డేట్ ఇస్తారా అనేది అడుగుతున్నారు.
ఈ క్రమంలో సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నారని, అంతా ఓకే అయ్యిందని కూడా చెబుతున్నారు. ఈ పుకార్లు ఎవరు రేపారో తెలియదు కానీ.. అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఇది అన్యాయం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని కూల్ చేసే పని తమన్‌కు అప్పగించినట్లుంది చిత్రబృందం. సినిమాలో రీసెంట్‌గా సభ్చుడైన తమన్… (అంటే రీరికార్డింగ్ కోసం మొన్నీమధ్య తీసుకున్నారుగా అలా లాస్ట్ మెంబర్ అన్నమాట) ఓ ట్వీట్ చేశాడు.
సినిమా గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్స్, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందుతోందని చెప్పాడు తమన్. దాంతోపాటు గ్రాండ్ ప్రేమతో చిత్రబృందం రూపొందించిన బ్లాక్‌బస్టర్ రాధేశ్యామ్‌ను థియేటర్లలోనే చూస్తారు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు తమన్. అంతేకాదు ఈ సినిమాను డాల్బీ అట్మాస్, డాల్బీ సినిమా సాంకేతికతతో సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. మరి తమన్ మాట ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.