తమిళంలో హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘జైభీమ్’. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అణగారిన వర్గాలపై పోలీసులు ఎలా కేసులు పెడతారు..? వారిని ఎలా శిక్షిస్తారు..? చేయని నేరాన్ని ఒప్పుకోమని ఎంత టార్చర్ చేస్తారనే విషయాలను ఈ సినిమాలో చూపించారు.
1993లో తమిళనాడులో గిరిజన యువతీ కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాడారు. ఇదే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు. ఇందులో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించగా.. సినతల్లి పాత్రలో మలయాళీ నటి లిజోమోల్ నటించింది. ఈ సినిమాలో సూర్య పాత్రతో పాటు సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ ను కూడా సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. పూర్తి డీగ్లామర్స్ రోల్ లో అద్భుతంగా నటించింది లిజోమోల్. తాజాగా ఈ నటి ‘జైభీమ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు గ్లిజరిన్ అవసరం లేకుండానే ఏడ్చేసిందట. సినిమా ప్రభావం తనపై ఎక్కువగానే చూపించిందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తను చేసిన పాత్రలన్నింటికంటే సినతల్లి పాత్ర ప్రత్యేకమని తెలిపింది. పోలీసులు చిత్రహింసలు పెట్టే సన్నివేశాల్లో నటించినప్పుడు అసలు గ్లిజరిన్ అవసరం లేకుండా నటించానని చెప్పింది. ఆ సన్నివేశాలు చేస్తున్నంతసేపు కళ్లలో నీళ్లు వచ్చేవని చెప్పింది. డైరెక్టర్ కట్ చెప్పినా.. కన్నీళ్లు మాత్రం ఆగేవి కావని చెప్పింది.