శోభన్ బాబు.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. అప్పటి రోజుల్లో అందగాడు అనగానే టక్కున శోభన్ బాబు పేరే చెప్పేవారు. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉండేది. అప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ వంటి వారు స్టార్లుగా రాణిస్తున్న టైములో.. కుటుంబ కథా చిత్రాలు చేసి కూడా బ్లాక్ బస్టర్లు కొట్టేవారట శోభన్ బాబు. ఓ దశలో శోభన్ బాబు.. క్రేజ్ చూసి ఆ లెజండ్స్ కూడా షాక్ తిన్నారని వినికిడి. అయితే శోభన్ బాబు గారికి మాత్రం ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అతని సన్నిహితులు చెబుతున్నారు.
శోభన్ బాబు తన ఇంట్లో ఎన్టీఆర్ ఫోటోని పెట్టి.. ఆరాధించేవారని ఓ సందర్భంలో కృష్ణంరాజు సైతం చెప్పుకొచ్చారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. శోభన్ బాబు సినిమా రంగంలోకి ప్రవేశించక ముందు నుండీ ఎన్టీఆర్ ను ఇష్టపడేవారట. ఇక అన్నగారు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దైవబలం’ చిత్రంతోనే శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండీ శోభన్ బాబుని.. ఎన్టీఆర్ ప్రోత్సహిస్తూనే వచ్చారట. ‘సీతారామకళ్యాణం’ చిత్రంలో లక్ష్మణుడి పాత్రకు కూడా శోభన్ బాబునే ఎంచుకున్నారు ఎన్టీఆర్. అటు తరువాత తన సొంత చిత్రాలతో పాటు, తాను హీరోగా నటించిన అనేక చిత్రాల్లో శోభన్ బాబుకు అవకాశాలు ఇచ్చారు ఎన్టీఆర్.
‘భీష్మ’ ‘మహామంత్రి తిమ్మరుసు’ ‘లవకుశ’ ‘నర్తనశాల’ ‘కర్ణ’ ‘ప్రమీలార్జునీయం’ ‘శ్రీకృష్ణ పాండవీయం’ ‘పరమానందయ్య శిష్యుల కథ’ ‘శ్రీకృష్ణావతారం’ ‘నిండు హృదయాలు’ ‘మాతృదేవత’ ‘పెత్తందార్లు’ ‘మాయని మమత’ వంటి చిత్రాల్లో శోభన్ బాబుకి కూడా అవకాశాలు ఇచ్చారు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ కు శోభన్ బాబు ఎంతో విధేయత చూపిస్తారని తెలుస్తుంది. పెద్దాయన మాత్రమే కాదు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే కూడా శోభన్ బాబుకి చాలా ఇష్టమని తెలుస్తుంది.