టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించాయి. అయితే రైటర్ గా సక్సెస్ సాధించిన విజయేంద్ర ప్రసాద్ పలు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ సినిమాలు మాత్రం సక్సెస్ సాధించకపోవడం గమనార్హం. తాజాగా ఒక సందర్భంలో రైటర్ గా సక్సెస్ కావడం గురించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి విజయేంద్ర ప్రసాద్ కథలతో సినిమాలను తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
రాజమౌళి డైరెక్టర్ కాకముందే రచయితగా విజయేంద్ర ప్రసాద్ ఖాతాలో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు ఉన్నాయి. ఈ జానర్ ఆ జానర్ అనే తేడాల్లేకుండా విజయేంద్ర ప్రసాద్ అన్ని జానర్లలో సినిమా కథలను రాస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ యండమూరి వీరేంద్రనాథ్ ను ప్రశంసించారు. పదేళ్లకు పైగా రైటర్ గా యండమూరి కెరీర్ ను కొనసాగించారని స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు సైతం ఆయనకోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు రెండుమూడు గంటల సమయం మాత్రమే కేటాయించేంత బిజీగా యండమూరి ఉండేవారని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను రైటర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఉంటే జీవనం సాగించవచ్చని తాను భావించేవాడినని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. యండమూరి ప్రతిభను చూసి తాను అలా రాయగలనా అని అనుకున్నానని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆయన రచయితగా కొనసాగి ఉంటే నాకు ఈ రంగంలో ఛాన్స్ ఉండేది కాదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
పరోక్షంగా యండమూరి కూడా తన సక్సెస్ కు కారణమని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తను గొప్ప రచయిత అయినప్పటికీ విజయేంద్ర ప్రసాద్ మరో రచయిత గురించి గొప్పగా చెప్పడం గమనార్హం.