బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోకు మహేష్ బాబు, మోహన్ బాబు, అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి, మరి కొందరు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరై తమ సినిమాలకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను షోలో చెప్పుకొచ్చారు. అయితే ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. చిరంజీవి బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిరంజీవి బాలయ్య మధ్య వృత్తిపరంగా పోటీ ఉండగా వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు.
చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి, బాలయ్య సినిమాలు పోటాపోటీగా థియేటర్లలో ఒకే సమయంలో విడుదలయ్యేవి. ఈ పోటీలో కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధిస్తే మరి కొన్నిసార్లు నా బాలయ్య పైచేయి సాధించి ఇద్దరుహీరోలు ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒకే సమయంలో రిలీజయ్యాయి. అన్ స్టాపబుల్ షో కోసం పని చేస్తున్న బీవీఎస్ రవి చిరంజీవి ఈ షోకు హాజరు కాకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.
చిరంజీవి ఈ షోకు రావడానికి ఆసక్తి చూపించారని అయితే డేట్లు అడ్జస్ట్ చేయడం సాధ్యం కాకపోవడంతో రాలేదని బీవీఎస్ రవి అన్నారు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ వీళ్లిద్దరిదే అయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇప్పటికే అందుకు సంబంధించిన వర్క్ కూడా జరిగిందని బీవీఎస్ రవి వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల షూటింగ్ లు, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్నారని బీవీఎస్ రవి పేర్కొన్నారు. అన్ స్టాపబుల్ సీజన్2 కు ఆయన తప్పకుండా వస్తారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.
ఈ షో కోసం నాగార్జునను ఇప్పటివరకు అడగలేదని వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉండటం వల్ల ఈ షోకు హాజరు కాలేకపోయారని బీవీఎస్ రవి వెల్లడించారు. బాలయ్య షోకు ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వస్తే బాగుంటుందని ఆయా స్టార్ హీరోల అభిమానులు భావిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్2 ఈ ఏడాది సెకండాఫ్ లో మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.