ఉదయభాను.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరేమో. తనదైన పంచ్‌లు, మాడ్యులేషన్‌తో ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందారు ఉదయభాను. సుమ, ఝూన్సీ, శిల్పా చక్రవర్తి వంటి వారు తెలుగు బుల్లితెరను ఏలుతున్న కాలంలో ఉదయభాను సైతం తన మార్క్ చూపించారు. ఒకానొక దశలో యాంకర్‌గా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుని ఔరా అనిపించారు. కుటుంబ కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులతో 15 ఏళ్ల వయసులోనే వ్యాఖ్యాతగా అడుగుపెట్టిన ఉదయభాను.. హృదయాంజలి ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ఇక వరుసపెట్టి వన్స్‌మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను వంటి షోలకు యాంకర్‌గా చేస్తూనే సినిమాలలోనూ అవకాశాలు దక్కించుకున్నారు. అలా శ్రావణ మాసం, ఎర్రసైన్యం, లీడర్, కొండవీటి సింహం వంటి సినిమాల్లో నటించారు. అలాంటి ఉదయభాను వెండితెరకు, బుల్లితెరకు ఏకకాలంలో దూరమయ్యారు. దీంతో గాసిప్ రాయుళ్లు రకరకాల పుకార్లు వ్యాపింపజేశారు. ఆమెకు ఎవరితోనో అఫైర్లు వున్నాయని, సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుందని ఇలా ఎవరికి తోచినట్లు వారు వార్తలు వండివార్చారు. అయితే ఆమె పరిశ్రమకు దూరమవ్వడం వెనుక కారణం వేరే వుంది.
పెళ్లి తర్వాత సుమారు పదేళ్ల తర్వాత ఉదయభాను ట్విన్స్‌కి జన్మనిచ్చారు. వారి ఆలనా, పాలనాతోనే ఆమెకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ప్రస్తుతం భర్త, పిల్లలే ప్రపంచంగా బతుకుతున్న ఉదయభాను అందుకే బుల్లితెర, వెండితెరకు దూరమయ్యారట. అయితే ఆమె చిన్నారులిద్దరూ పెరిగి పెద్దయిన తర్వాత ఉదయభాను తిరిగి పరిశ్రమ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని కొందరి వాదన.