అల్లు అర్జున్ – సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ మూడేళ్ల శ్రమ… ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే… ‘పుష్ప – ది రైజ్’. మాస్ హీరోకు సరైన కథ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించాడు బన్నీ. మ్యాజికల్ బ్రెయిన్ ఉన్న దర్శకుడి చేతిలో మాస్ కథ, అందుకు తగ్గ హీరో వస్తే ఎలా ఉంటుందో సుకుమార్ చూపించారు. రెండో పార్టు ఉన్న సినిమా కాబట్టి… కొన్ని లెక్కలు తేల్చలేదు. రెండో పార్టులో వాటి సంగతి చూపిస్తా అని చెప్పేశారు. అవేంటో మనం కూడా ఓ లుక్కేసేస్తే మంచిది కదా. ‘పుష్ప – ది రూల్’లో ఏమేం ఉండొచ్చో చూద్దామా?
* ‘పుష్ప – ది రూల్’ పేరులోనే రెండో పార్టు కథ చెప్పేశాడు సుకుమార్. తొలి పార్టులో ఎదిగిన ‘పుష్ప’రాజ్… రెండో పార్టులో ఎర్రచందనం మాఫియా సిండికేట్‌ను ఏలుతాడు. అదెలాగో తెరపై చూడాల్సిందే.
* మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రెండో పార్టు గురించి ఇప్పటికే చెప్పేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలవుతుంది. అంతవరకు చిన్న గ్యాప్ ఇస్తున్నారు.
* సమయం వచ్చే వరకు వెయిట్ చేస్తా అన్న మంగళం శ్రీను గొంతుని ద్రాక్షాయని కోసేసింది. హాస్పిటల్‌లో మంగళం శ్రీను కోలుకొని వస్తాడో, లేక ద్రాక్షాయని విలనిజం చేస్తుందో చూడాలి.
* సినిమా ఆఖరు ఫాఫా అదేనండి మన భన్వర్ సింగ్ షెకావత్‌ను బట్టలు లేకుండా రోడ్డెక్కించాడు పుష్ప. రెండో పార్టులో పగ తీర్చుకోక తప్పదు. అదెలాగో చూడాలి.
* రెండో పార్టులో శ్రీవల్లి సందడి మామూలుగా ఉండదు అని ఆ మధ్య రష్మిక ఓసారి చెప్పింది. ఆ సందడేందో చూడాల్సిన అవసరం కూడా ఉంది.
* పుష్పరాజ్ పుట్టుక మీద సినిమాలో చాలా డైలాగ్‌లు ఉంటాయి. వాటికి సరైన సమాధానం, అజయ్ పాత్రకు రిటార్ట్ రెండో పార్టులో పక్కాగా ఆశించొచ్చు.
* కాళ్లు, నడుము పడిపోయి జాలీ రెడ్డి… జాలిగా ఇంట్లో కూర్చున్నాడు. రెండోపార్టులో ఎవరి సాయం తీసుకుంటాడో, ఎవరికైనా సాయపడతాడో చూడాలి. ఏదైనా ఈ పాత్ర అంత ఈజీగా సావదని తెలిసిపోతోంది.
* తొలి భాగంలో ఉన్న విలన్స్‌కు రెండో భాగంలో కొత్త విలన్స్ యాడ్ అవ్వాలి. లేదంటో బోర్ కొట్టేస్తుంది. వాళ్లెవరు అనేదీ ఆసక్తికరమే.
* పుష్పరాజ్ సరుకుని చెన్నై మురుగన్‌కి అమ్ముతుంటాడు. ఆ మురుగన్ దందా లెక్క కూడా రెండో పార్టులోనే తేలుతుంది. అక్కడ పెద్ద బాస్ ఎవరనేది ఇంకో ప్రశ్న.
* సుకుమార్ – బన్నీ – దేవిశ్రీప్రసాద్ అంటే పక్కా ఐటెమ్ సాంగ్ కన్‌ఫామ్. మరి రెండో పార్టులో ఐటెమ్ పాప ఎవరు అనేది కూడా ఆలోచించాల్సిందే. తొలిపార్టులో సమంత లాంటి స్టార్ నాయికను తెచ్చారు. మరి మలి పార్టు సంగతో.