రామాయణ, మహాభారత గాథల్ని వివిధ కోణాల్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కథలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పటి ఆధునిక పరిజ్ఞానంతో రామాయణ, మహాభారత గాథల్ని తీస్తే.. జనాలకు మరింత చేరువ అవుతుందనేది దర్శకనిర్మాతల నమ్మకం. అందుకే.. రాజమౌళి ‘మహాభారతం’పై దృష్టి పెట్టాడు. ఎప్పటికైనా మహాభారతం తీస్తానని ప్రకటించాడు. అయితే ఇప్పుడు రాజమౌళి గురువు రాఘవేంద్రరావు రామాయణం తీయడానికి రెడీ అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామాయణం రూపుదిద్దుకోబోతుంది.
అయితే ఇది రామాయణంలో మరో కోణమని తెలుస్తోంది. మొత్తం రామాయణ గాథని సీత కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకి ‘సీత చెప్పిన రామాయణం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి కథ కూడా సిద్ధమైంది. దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలనేది రాఘవేంద్రరావు ప్లాన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే క్యాస్టింగ్ పనులు కూడా మొదలుపెట్టారు.