ఓటీటీల ద్వారా అదనపు ఆదాయం వస్తుండడంతో నిర్మాతలు మురిసిపోతున్నారు. కానీ ఈ ఓటీటీల కారణంగా వచ్చే ఆదాయం కంటే నష్టమే ఎక్కువ ఉందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నారు. డిజిటల్ రిలీజ్ కారణంగా శాటిలైట్ హక్కుల రేట్లు తగ్గాయి. అలానే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా మెల్లగా తగ్గిపోతుంది. కొత్త సినిమా థియేటర్లోకి వచ్చిన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. పెద్ద సినిమాలను కూడా మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుంది.
కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అని థియేటర్లకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ప్రేక్షకులు. ఈ మధ్యకాలంలో విడుదలైన పెద్ద సినిమాలన్నీ మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజ్ అయిపోయాయి. దీనికి సంబంధించిన ప్రతికూల ప్రభావం గురించి టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు ఈ విషయంలో చర్చించుకొని.. ఇండస్ట్రీలో అంతర్గతంగా కొన్ని కండీషన్స్ పెట్టాలని డిసైడ్ అయినట్లు నిర్మాత బన్నీ వాసు సంకేతాలు ఇచ్చారు.
గీతాఆర్ట్స్ సినిమాల వరకు థియేట్రికల్ రిలీజ్ తరువాత ఐదు వారాల్లోపు డిజిటల్ రిలీజ్ ఉండకూడదని రూల్ పెట్టుకున్నామని చెప్పారు. బాలీవుడ్ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండడంతో థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటీటీ విడుదలకు 68 వారాల గ్యాప్ ఉండాలని కండీషన్ పెట్టుకున్నట్లు.. టాలీవుడ్ లో కూడా ఇలాంటి కండీషన్స్ రాబోతున్నట్లు బన్నీ వాసు తెలిపారు. ఓటీటీ రిలీజ్ విషయంలో కఠినంగా ఉండాలని.. నిర్మాతల్లో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు.