సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన తేజ ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. మొదటి సినిమానే సూపర్ హిట్. టీనేజ్ లవ్ అండ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమా యూత్ కి బాగా నచ్చేసింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ లను హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన ఆ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 2001 లో మళ్ళీ ఉదయ్ కిరణ్ హీరోగా నువ్వు నేను పేరుతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా ఆ ఏడాదికి గాను టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమాతో తేజ టాలీవుడ్ లో యూత్ఫుల్ చిత్రాల దర్శకుడిగినా పేరు తెచుకున్నాడు. 2002లో తేజ మరో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ జయం సినిమా తీశారు. హీరో నితిన్, సదాల డెబ్యూ మూవీగా వచ్చిన ఆ మూవీ ఆ ఏడాది వచ్చిన భారీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. జయం మూవీ తరువాత తేజ ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు.
ఐతే తేజాకే అదే చివరి హిట్టు. ఎన్నో అంచనాలతో ఆయన మహేష్ తో చేసిన నిజం విజయం సాధించలేదు. ఆ తరువాత ఆయన నుండి వచ్చిన జై, ధైర్యం, అవునన్నా కాదన్నా, లక్ష్మీ కళ్యాణం వరుసగా పరాజయం పొందాయి. హోరా హోరి వరకు కొనసాగిన ఆయన ప్లాప్ సినిమాల యాత్ర రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆగింది. ఆ సినిమా ఆయనకు కొంచెం ఉపశమనం ఇవ్వడంతో పాటు, ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక గత ఏడాది తేజ సీత మూవీ చేయగా అది కూడా పరాజయం పొంది తేజను దెబ్బేసింది.
కాగా రాను రాను ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ హవా పెరుగుతున్న తరుణంలో తేజ కూడా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఆయన కూడా కొన్ని వెబ్ సిరీస్ లకు దర్శకత్వం చేసే యోచనలో ఉన్నారట. కొద్దిరోజుల క్రితం తేజ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. అలివేలు మంగ వెంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు అనే ఈ టైటిల్స్ బహుశా వెబ్ సిరీస్ ల కోసమేనా అనే డౌట్ కొడుతుంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.