తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. మాస్ ని మెప్పించడానికి దర్శకులు, నిర్మాతలు మసాలా పాటను తమ సినిమాల్లో పెట్టేవారు. దీని వల్ల కలక్షన్ల పెరుగుతుండడంతో ఈ సంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతూ వస్తోంది. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఐటెం సాంగ్స్ కోసం జ్యోతిలక్ష్మి, జయమాలిని అంటూ ప్రత్యేక డ్యాన్సర్లు ఉండేవారు. తర్వాత కూడా సిల్క్ స్మిత, అనురాధ, ముమైత్ ఖాన్ లు మసాలా పాటలకు కైపు ఇచ్చేవారు.
హీరోయిన్లు ఆ పాటల జోలికి వెళ్లేవారు కాదు. అటువంటి పాటలు చేస్తే హీరోయిన్ అవకాశాలు పోతాయని భయపడేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. టాప్ హీరోయిన్లు సైతం సింగిల్ పాటకు సై అంటున్నారు. అదిరిపోయే స్టెప్పులతో అందాలు ఆరబోస్తున్నారు.శ్రీయా కథానాయికగా బిజీగా ఉన్న సమయంలోనే దేవదాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత అనుష్క, చార్మీ, పార్వతి మెల్టన్, అంజలి ఇలా ఎంతోమంది ప్రత్యేక పాటలో నర్తించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో బిజీ హీరోయిన్లుగా ఉన్న శృతి హాసన్, తమన్నా, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు.
ఓ వైపు బిగ్ స్టార్స్ పక్కన మెయిన్ హీరోయిన్ గా నటిస్తూనే స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నారు. శృతి హాసన్ “ఆగడు”లో జంక్షన్లో అంటూ అదరగొడితే, కాజల్ జనతా గ్యారేజ్ లో “పక్కా లోకల్” అంటూ అందరినీ తన వైపు తిప్పుకుంది. తమన్నా “అల్లుడు శీను” లో ఐటెం సాంగ్ చేసి ఆశ్చర్య పరిచింది. డెబ్ట్ హీరో తో సీనియర్ నటి ఐటెం సాంగ్ చేయటమేంటని విమర్శలు వెళ్లు వెత్తినా ఆమె పట్టించుకోలేదు. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న జాగ్వర్ అనే చిత్రంలో మిల్కీబ్యూటీ మరో డెబ్ట్ హీరో తో ఐటెం సాంగ్ కి సై అనింది. పారితోషికం 75 లక్షలు అందుకొని.. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సామెతను గుర్తు చేసింది. ఇలా ఐదు రోజుల్లో పూర్తి అయ్యే పాటలకు అరకోటికి మించి వసూల్ చేస్తూ దూసుకు పోతున్నారు నేటి టాప్ హీరోయిన్లు.