సినిమాటిక్ యూనివర్స్… ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో దీని గురించే మాట్లాడుతున్నారు. కొత్తగా వచ్చే దర్శకులు తమ సినిమాలకు లింక్‌లు పెట్టి సినిమాటిక్ యూనివర్స్‌లు చేస్తుంటే, పాత దర్శకులు అప్పుడెప్పుడో చేసిన సినిమాల్లో పాయింట్లు పట్టుకుని యూనివర్స్‌లు చేసే పనిలో ఉన్నారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తొలి రకం అయితే, యశ్‌రాజ్ సినిమాటిక్ యూనివర్స్ రెండో రకం. ఇప్పుడు ఈ రెండో రకంలో త్రివిక్రమ్ కూడా చేరుతున్నారా? అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.
మహేష్‌బాబు, త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుండి ఇటీవల ఓ పాట బయటకు వచ్చింది. దాంతోపాటు మేకింగ్ సన్నివేశాల్లోని కొన్ని పిక్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని బట్టి ‘త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్’ సిద్ధమవుతోంది అంటూ అంచనా వేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో తారక్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే పుకారు కూడా సినిమా యూనివర్స్ వార్త బయటకు రావడానికి కారణం అని చెప్పాలి.
ఏంటీ ఈ ఒక్క విషయంలో సినిమాటిక్ యూనివర్స్ ఫిక్స్ అయిపోతారా అని అనొచ్చు. అదొక్కటే కాదు ‘అరవింద సమేత’ సినిమాలో వాడిన ఓ పార్టీ గుర్తు, ‘గుంటూరు కారం’ సినిమాలోనూ ఉంది. అంతేకాదు, ఈశ్వరీ రావు రెండు సినిమాల్లోనూ ఉన్నారు. దాదాపు ఒకే లుక్‌లో ఉన్నారు. అయితే ఈ విషయంలో చిత్ర వర్గాల నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఘనంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని టీమ్ ఇప్పటికే చెప్పేసింది. దానికి తగ్గట్టుగా స్పీడ్‌గా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పాటతో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. అయితే పాట విడుదలకే చాలా రోజులు టింకర్లు చేశారు అని నిర్మాత నాగవంశీనే చెప్పారు. మరి సినిమాకు ఇంకెన్ని టింకర్లు ఉంటాయో తెలియాలి. ఈ విషయం ఇలా ఉంటే సినిమాటిక్ యూనివర్స్ విషయంలో సినిమా ప్రచారంలో కాస్త తెలియొచ్చు అని చెబుతున్నారు.