జెలోమ్ సల్లే.. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇంతకుముందు పరిచయమే. ఇంకా గుర్తుకురాకపోతే ‘లార్గో వించ్’ దర్శకుడు అంటే గుర్తొచ్చేస్తుంది. ఇంకా గుర్తుకురాకపోతే ‘అజ్ఞాతవాసి కాపీ కథ’ అనే మాట వింటే మొత్తం క్లారిటీ వస్తుంది. ‘అజ్ఞాతవాసి’ విడుదల సమయంలో జెలోమ్ సల్లే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తన ‘లార్గో వించ్’కు ‘అజ్ఞాతవాసి’ కాపీ అని ఎవరో చెబితే ‘లార్గో వించ్ 2’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అదే జెలోమ్ సల్లే ‘లార్గో వించ్ 3’ అనే ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇప్పుడు ఆయన మూడో నెంబరు ఇచ్చిన సినిమా ‘వారసుడు’. అవును విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా గురించే జెలోమ్ ఈ ట్వీట్ చేశారు. విజయ్ జన్మదినం సందర్భంగా ఇటీవల ‘వారసుడు’ చిత్రబృందం కొన్ని పోస్టర్లు లాంచ్ చేసింది. దాంతో కొంతమంది నెటిజన్లు సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్‌ను రూపొందించారు. ధనికుడైన ఓ వ్యక్తి బిడ్డ, తండ్రికి దూరంగా పెరుగుతుంటాడు. అనుకోకుండా తండ్రి మరణించడంతో ‘వారసుడు’గా ఎంట్రీ ఇచ్చి…
తన తండ్రి మరణానికి కారణమైనవ వాళ్లను అంతమొందించడానికి వస్తాడు. ఇదే కథ అంటూ ఆ పోస్ట్‌ల్లో రాసుకొచ్చారు. ఈ పోస్టులు అటు తిరిగి, ఇటు తిరిగి జెలోమ్ సల్లే వద్దకు చేరాయి. దీంతో ఆయన ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ‘లార్గో వించ్ 3’ అంటూ మెన్షన్ చేశారు. దీంతో ‘వారసుడు’ సినిమా కథ కాపీ అంటూ పుకార్లు మొదలయ్యాయి. కేవలం టైటిల్‌ను పట్టుకుని ఈ స్టోరీని అల్లారా లేక ఏదైనా లీక్ బయటికి వచ్చిందా అనేది తెలియడం లేదు.
ఒకవేళ ట్రైలర్ వస్తే దాని బట్టి చెప్పేయొచ్చు. ఏదీ రాకుండానే పుకార్లు రావడం జెలోమ్ రియాక్ట్ అవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ‘అజ్ఞాతవాసి’ విషయంలో జెలోమ్ ట్వీట్, సెటైర్ కరెక్ట్ అయ్యింది. దీంతో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ‘వారసుడు’ విషయంలోనూ అంతే అవుతుందా? లేక వంశీ పైడిపల్లి కొత్తగా ఆలోచించి కథ రాశారా అనేది చూడాలి.