కెరీర్ ప్రారంభంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పీడ్ మామూలుగా ఉండేది కాదు. 2017లో 2 సినిమాలు చేసిన విజయ్.. 2018లో ఏకంగా 5 సినిమాలు చేశాడు. అయితే కాస్త స్టార్ స్టేటస్ రావడం ఆలస్యం.. ఆయన సినిమాల స్పీడ్ తగ్గింది. ఆ తర్వాత ఏడాది నుండి ఇప్పటివరకు ఏడాదికి ఒక సినిమానే చేస్తూ వస్తున్నాడు. అయితే అందులో విజయాల శాతం తక్కువగా ఉంటూ వస్తోంది. 2024లో ‘ఫ్యామిలీ స్టార్’తో (Family Star) వచ్చి బాక్సాఫీసు దగ్గర బోల్తాపడిన విజయ్..
ఇప్పుడు ‘కింగ్‌డమ్’ అంటూ మే ఆఖరులో రానున్నాడు. ఈ గ్యాప్‌లన్నీ గుర్తొచ్చాయో ఏమో ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు అంటున్నాడు. అవును, ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు కిక్‌స్టార్ట్‌కి రెడీగా ఉన్నాయి. ఉన్న ఆ రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం. అందులో ఓ సినిమా రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో పీరియాడిక్ మూవీ కాగా, మరకొటి రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో పీరియాడిక్ మాస్ యాక్షన్ మూవీ.
ఈ రెండు ప్రాజెక్ట్‌లను జూన్ లేదా జులై ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట. ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించి అన్ని పనులు అయిపోగానే ఈ సినిమాలు స్టార్ట్ చేస్తారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాహుల్ సాంకృత్యాన్ సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా జూన్‌లో హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. కుదిరితే వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభించేయాలనే ఆలోచనలో ఉన్నాడట విజయ్.
ఇక రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో రూపొందనున్న ‘రౌడీ జనార్దన్’ సినిమాను ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న సినిమా ఇది. వీలైతే రెండు సినిమాలు పారలల్‌గా రన్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే రెండూ పీరియాడిక్ సినిమాలు కాబట్టి ఒకేసారి చిత్రీకరణ పెట్టుకునే ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ రోజుల్లో హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేయడం అరుదుగా మారింది. మరి విజయ్ ఆ ఆలోచనను, మాటను మారుస్తాడేమో చూడాలి.