ఒక దర్శకుడి నుండి వచ్చే రెండు సినిమాలు పోల్చి చూడటం సాధారణమైన విషయమే. ఆ రెండు సినిమాల్లో ఇది బెటరు, ఈ రెండు సినిమాలు దానికి తగ్గట్టు లేవు అని అంటుంటారు. అలా ఇప్పుడు ‘బెటర్’ కాన్సెప్ట్ రన్ అవుతున్న సినిమా ‘బాహుబలి,’ ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి చెక్కిన సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన అద్భుతం ‘బాహుబలి’. ఇటీవల ‘ఆర్‌ఆర్ఆర్’ మేకింగ్ వీడియో వచ్చి… ‘బాహుబలి’ కంటే ఇది బెటరా? అనే ప్రశ్న వచ్చింది. దీనిపై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
ఇప్పటివరకు వచ్చిన రాజమౌళి సినిమాల్లో ‘బాహుబలి’ విజువల్ వండర్ అయితే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రాజమౌళి చేసే ఏ రెండు సినిమాల మధ్య పోలిక ఉండదన్న విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాల గురించి తనదైన విశ్లేషణ చేశారు. వాటి ప్రకారం చూస్తే… రాజమౌళి సినిమాల్ని ఒకదానికొకటి పోల్చడం అంత తెలివైన పని కాదు అని అర్థమవుతుంది. ‘స్టూడెంట్ నంబర్ 1’తో దర్శకుడిగా రాజమౌళి పరిశ్రమకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ‘సింహాద్రి’ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత రగ్బీ క్రీడతో ‘సై’ తీశారు. దాని తర్వాత ‘ఛత్రపతి’. ఆ వెంటనే ‘విక్రమార్కుడు’. ఆ సినిమా మంచి ఎంటర్‌టైనర్. ఆ వెంటనే ‘యమదొంగ’, ‘మగధీర’ వచ్చాయి. ‘మగధీర’అందించిన భారీ విజయం తరువాత అగ్ర హీరోలు రాజమౌళితో కలిసి పనిచేయడానికి ఎదురుచూశారు. కానీ సునీల్‌తో ‘మర్యాద రామన్న’ తీశాడు. ఆ తర్వాత ‘ఈగ’ చేశాడు. దానికి వచ్చిన స్పందన మీకు తెలిసిందే. ఇక ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తుంది. అంటూ రాజమౌళి సినిమాల లెక్క చెప్పారు విజయేంద్రప్రసాద్.