బ్లాక్‌బస్టర్ సినిమాలు అంటే ఎంత ఆసక్తి ఉంటుందో… వాటి సీక్వెల్స్ విషయంలోనూ అంతే ఉంటుంది. ఎందుకంటే తొలి సినిమాను మించి విజయం సాధించాలి అని అభిమానులు ఆశిస్తుంటారు. అయితే మన దగ్గర రెండు పార్టుల సినిమాలకు నడుస్తుంది కానీ… సీక్వెల్స్‌కు పెద్దగా కలసి రావడం లేదు. ఈ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్ వచ్చి భారీ విజయం సాధించి… ఆ పాత నానుడిని తిరగరాయాలని ఇండస్ట్రీ జనాలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మనకు రీసెంట్‌గా రెండు సినిమాలు వినిపిస్తుంటాయి.
అందులో ఒకటి తెలుగులో వచ్చి అన్ని భాషల్లోకి వెళ్లిన ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) కాగా… రెండోది హిందీలో వచ్చి దేశం మొత్తం ఓ ఊపు ఊపేసిన ‘భజరంగీ భాయిజాన్’. ఈ రెండు సినిమాల విషయంలో కామన్ పాయింట్ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad). ఆయన రాసిన ఆ సినిమాల సీక్వెల్స్ గురించి గత కొన్నేళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ఆ సినిమాల కథకుడు విజయేంద్రప్రసాద్ ఓ సినిమా కార్యక్రమం కోసం వచ్చినప్పుడు ఆ చిత్రాల గురించి చెప్పారు. దీంతో ఆ హీరోల ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
‘విక్రమార్కుడు 2’, ‘బజరంగీ భాయిజాన్ 2’ సినిమాల స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తీపివార్త చెప్పారు విజయేంద్రప్రసాద్. ఇప్పుడు ఆయా సినిమాల గురించి నటీనటుల ఎంపిక జరుగుతోంది అని తెలిపారు. క్యాస్టింగ్ ఓకే అయిన వెంటనే సినిమాలు మొదలుపెడతామని కూడా చెప్పారు.. ‘భజరంగీ భాయిజాన్ 2’ కథ సల్మాన్‌ఖాన్‌కు (Salman Khan) వినిపించే పనులు జరుగుతున్నాయి అని చెప్పారు. త్వరలోనే ఈ విషయం తేలుతుంది అని తెలిపారు.
ఇక ‘విక్రమార్కుడు 2’కు కూడా రాజమౌళినే (S. S. Rajamouli) దర్శకత్వం వహించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇటీవల రవితేజ (Ravi Teja) ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళితో ని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెప్పారు. అయితే ఆ కథతో ముందుకు రావడానికి రాజమౌళి రెడీగా లేరు. మరోవైపు ఈ కథకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ ఆ కథను ఎవరికి ఇస్తారో చూడాలి.