‘వింటేజ్ మెగాస్టార్‌ను చూపిస్తా!’.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ముహూర్తం నాడు దర్శకుడు బాబీ చెప్పిన మాటలు ఇవి. ఏదో మాట వరసకు అన్నారులే.. నిజంగానే అప్పటి చిరంజీవిని చూపిస్తారా? చూపించడం అంత ఈజీనా? అప్పటి లుక్ ఇప్పుడు రావడం సాధ్యమా? అని అభిమానులు అనుకున్నా.. ఎక్కడో చిన్న ఆశ నాటి మెగాస్టార్‌ను చూడాలని. అనుకున్నట్లుగానే పోస్టర్‌లు, వీడియోల్లో నాటి చిరు మళ్లీ కనిపించాడు. అయితే ఇప్పుడు అభిమానులు మరొకటి కూడా కోరుకుంటున్నారు. అదే ఇండస్ట్రీ హిట్.
అవును, చిరంజీవి గత సినిమాలు విజయాలు సాధిస్తున్నా.. బాక్సాఫీసు దగ్గర అప్పటి విజయాలను క్లియర్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్‌లను కొట్టలేకపోతున్నాడు. కాస్ట్ ఫెయిల్యూర్ అని, బ్రేక్ ఈవెన్ అని ఇలా చాలా పదాలతో వసూళ్ల లెక్కలు తేడా కొడుతున్నాయి. కాబట్టి ‘వాల్తేరు వీరయ్య’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అభిమానులు ఘనంగా ఫిక్స్ అయిపోయారు. అయితే దాని కోసం అవసరమైన మూడు అంశాల్లో రెండు ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’లో ఉన్నాయి. ఇంకా ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది.
చిరంజీవి అంటే.. కొన్ని అంశాలు సినిమాలో పక్కా అని అంటుంటారు. వాటిలో డ్యాన్స్, ఎనర్జీ వీటితోపాటు తనదైన కామెడీ. చిరంజీవి గత సినిమాలు చూస్తే ఈ అంశాలన్నీ కచ్చితంగా ఉంటాయి. అవన్నీ ఉన్న సినిమా భారీ విజయం పక్కా అనే మాట కూడా ఉంది. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో తొలి రెండు అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘బాస్ పార్టీ..’, ‘శ్రీదేవి చిరంజీవి..’, ‘పూనకాలు లోడింగ్..’ అంటూ వచ్చిన పాటల్లో ఆ రెండూ కనిపిస్తున్నాయి. దీంతో కామెడీ గురించే నెక్స్ట్ ఆలోచన.
చిరంజీవి కామెడీ చేస్తే.. చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయన సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. కామెడీ ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ తనదైన కామెడీ, పంచ్‌లు చిరంజీవి వేస్తే ఎంజాయ్ చేయడానికి.. తద్వారా సినిమాకు భారీ విజయం ఇవ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు. కాబట్టి కొల్లి బాబీ ఎంత మేర చిరు నుండి కామెడీ రాబట్టారు అనేదే ఇక్కడ ప్రశ్న. వింటేజ్ చిరు కామెడీకి ఫ్యాన్ కానివారు ఎవరు చెప్పండి.