‘పుష్ప’ సినిమా చూశారా… ఎలా అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కోలా సినిమా అనిపించి ఉండొచ్చు. అయితే స్పానిష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు బాగా ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం ఇదేంటి సుకుమార్ మొత్తం పాయింట్ అంతా ఎత్తేశాడే అనిపిస్తుంది. అంతేకాదు కొన్ని సన్నివేశాలు కూడా ఆ సిరీస్ స్ఫూర్తే అనిపిస్తుంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటంటారా? ఇంకేంటి ‘నార్కోస్’. అవును ఈ వెబ్‌సిరీస్ స్ఫూర్తితోనే సుకుమార్ ‘పుష్ప’ సినిమాను సిద్ధం చేసుకున్నారట. ఈ విషయం మేం అనడం లేదు.
సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ సిరీస్ నుండి పాయింట్ మాత్రమే కాకుండా… కొన్ని ఎలివేషన్ సీన్లు, కీలక సన్నివేశాలు కూడా తీసుకున్నారని టాక్.‘నార్కోస్’ వెబ్‌సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. డ్రగ్స్ సరఫరా చేసే ఎస్కోబార్ అనే ఓ వ్యక్తి జీవిత కథ అది. సాధారణ డ్రగ్స్ స్మగ్లర్‌గా మొదలుపెట్టి… ఆ రంగంలో డాన్‌గా మారిపోతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న అనుభవాలే ఆ సిరీస్. అందులో డ్రగ్స్‌కు బదులు ఎర్ర చందనం తీసుకొచ్చి ‘పుష్ప’ సిద్ధం చేశారు అంటున్నారు.
సినిమా చూస్తే ఈ విషయం చక్కగా అర్థమైపోతుంది కూడా. అయితే ఆ సిరీస్‌లోని పాయింట్‌ను గుడ్డిగా ఎత్తేయకుండా… మనకు తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేసుకున్నారు. మన నేటివిటీని జోడించారు. దీంతో స్పానిష్ వాసన రాదు. ‘నార్కోస్’ పూర్తి యాక్షన్ తరహాలో కాకుండా… రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అయితే ‘పుష్ప’ను మాస్ యాక్షన్ సినిమాగా మలిచారు. సీన్ల విషయానికొస్తే… తొలి సన్నివేశం నుండి ఆఖరి సన్నివేశం వరకు ఎక్కడో దగ్గర ‘నార్కోస్’ ప్లేవర్ కనిపిస్తుంది.
ఇంట్రడక్షన్‌లో పోలీసులకు లంచం ఇచ్చే సన్నివేశం… పోలీస్ స్టేషన్‌లో వివరాలు అడుగుతుంటే నవ్వే సీన్… పోలీసుల కళ్లు గప్పి ఎర్ర చందనం తరలించే సన్నివేశం… విలన్ల సంఖ్య, వాళ్ల చిత్రణ, హీరో స్నేహితుడి పాత్ర… ఇలా అన్నింటా ‘నార్కోస్’ ఫ్లేవర్ కనిపిస్తుంది. అయితే ముందుగా చెప్పుకున్నట్లు వాటికి సుకుమార్ రంగు ఉంటుంది. ఇక ‘పుష్ప’ రెండో పార్టు విషయానికొస్తే… ‘నార్కోస్’ ప్రకారం ఇలా ఉండొచ్చు.
‘నార్కోస్’ రెండో సీజన్‌లో హీరో చనిపోతాడు. ఇక్కడ ఆ సీన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. అందులో భార్యను ఏమన్నా అంటే హీరో అస్సలు ఊరుకోడు, రెచ్చిపోతాడు. రెండో పార్టు పుష్పలో ఈ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా కొన్ని పాత్రల ఎంట్రీ కూడా ఉండొచ్చు. మరి మన లెక్కల మాస్టారు లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి.