సినిమా విడుదల అవ్వడం.. ఆ రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవ్వడం అనేది మనం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ప్రభుత్వం, సినిమా పరిశ్రమ ఎంతగా ప్రచారం చేసి చైతన్యం తీసుకొస్తున్నా పైరసీ చేసేవాళ్లలో, చూసే వాళ్లలో మార్పు రావడం లేదు. ఈ విషయంలో కఠిన చట్టాలు వస్తున్నా అంతగా లాభం కనిపించడం లేదు. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనిపిస్తోంది.
Game Changer
సినిమా కథేంటి, సినిమాలో ముఖ్యమైన విషయాల్లేంటి, డైలాగ్‌లు ఏంటి అనేది థియేటర్‌లో మన పక్కన కూర్చొని ఎవరైనా మాట్లాడుతుంటేనే మనకు బాధేస్తుంది. సినిమా ముఖ్య విషయాలు ముందుగా ఇలా చెప్పేస్తే ఎలా అని అనుకుంటాం. అలాంటిది ఒక షో పూర్తవ్వకుండా సినిమాలోని ట్విస్టులు, బ్లాక్‌లు ట్విటర్‌లో వచ్చేశాయి. ఇక సినిమా తొలి షోకి వెళ్లి థియేటర్ నుండి బయటకు వస్తుంటే హెచ్‌డీ ప్రింట్ అంటూ లింక్‌లు, టెలీగ్రామ్ పోస్ట్‌లు బయటకు వచ్చేశాయి.
అలా వచ్చిన సినిమాను సంక్రాంతి బస్సుల్లో వేసేశారు. ఇళ్లల్లో టీవీల్లో చూశారు. మిగిలినవాళ్లేమో మొబైల్స్‌లో చూసేశారు. ఆఖరికి లోకల్ కేబుల్ టీవీల్లో కూడా సినిమాను సంక్రాంతి స్పెషల్ అంటూ రిలీజ్ చేసేశారు. ఇదంతా చూస్తుంటే పైరసీ అంటే భయం లేకపోవడం, సినిమా అంటే గౌరవం లేకపోవడమే కారణం అని అనిపిస్తోంది. సినిమా బాగుంటే థియేటర్‌కు వచ్చి చూస్తారు. లేదంటే ఓటీటీకి వచ్చేవరకు వెయిట్ చేసి చూస్తారు.
కానీ ఇలా ఇలా రిలీజ్ చేసేస్తే ఏ నిర్మాత అయినా ఏం చేస్తారు. అసలు అంత మంచి ప్రింట్ పైరసీ జనాల చేతుల్లోకి ఎలా వెళ్లింది. గత కొన్నేళ్లుగా సరైన ప్రింట్ పైరసీ వాళ్లకు రావడానికి చాలా సమయమే పట్టింది. ఒక వారం తర్వాతో, రెండు వారాల తర్వాతో చూసిన ప్రింట్.. ఇప్పుడు తొలి రోజే బయటకు వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ పైరసీ కాదు అనిపిస్తోంది. కావాలని కత్తి కట్టి, కక్ష కట్టి, భారీ ప్లాన్ గీసి చేసినట్లు అనిపిస్తోంది.
ఇదంతా చరణ్ మీద కోపమా లేక దిల్ రాజు మీద కోపమా అనేది తెలియడం లేదు. ఈ విషయంలో ఇది ఇంటి దొంగల పనా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టోరీ లీక్ వరకు ఓకే.. ట్విస్టులు, ప్లాట్‌లు, బ్లాక్‌ల లీక్ మరీ టూమచ్. ఇక మంచి ప్రింట్ సంగతి అయితే సరేసరి.