నందమూరి బాలకృష్ణ కలల సినిమా అనే ప్రస్తావన రాగానే ‘నర్తన శాల’ అని చెప్పేస్తారు అతని అభిమానులు. అంతలా ఆ సినిమాను ప్రేమించి తెరకెక్కిద్దాం అనుకున్నారు బాలయ్య. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమా ప్రారంభంలోనే ఆగిపోయింది. అంతలా ప్రేమించి చేసిన సినిమా కొన్ని సన్నివేశాలను ఆ మధ్య విడుదల చేసేశారు కూడా. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? ఈ సినిమా తీసుకొచ్చిన భయమేనా ఇప్పుడు బాలకృష్ణ ప్లాన్స్ మారుస్తోందా అనే డౌట్ వస్తోంది కాబట్టి.
‘నర్తన శాల’ సినిమా తర్వాత బాలయ్య అంతగా ఇష్టపడి, చాలా ఏళ్లుగా ప్లాన్ చేసి.. సిద్ధం చేస్తున్న సినిమాను డైరెక్ట్ చేయడానికి బాలయ్య ఎందుకో కానీ ముందుకు రావడం లేదు. అదే ‘ఆదిత్య 999 మ్యాక్స్’. బాలయ్య సినిమాల్లో బెస్ట్ అనిపించుకునే సినిమాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకి 25 ఏళ్లు అవుతున్న సందర్భంలో ఓసారి సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత 30 ఏళ్ల సందర్భంలో మరోసారి వచ్చింది. ఆ తర్వాత మరికొన్నాళ్లకు దాని గురించి మాట్లాడారు.
ఆఖరిసారిగా బాలయ్య ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు తానే దర్శకత్వం వహిస్తాను అని కూడా చెప్పారు. కథను ఓవర్‌నైట్ అనుకున్నామని కూడా చెప్పారు. తొలి భాగం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కూడా ఈ విషయంలో మాట్లాడాను అని చెప్పారు. ఆ తర్వాత చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం క్రిష్ రంగంలోకి దిగుతున్నారు అని అంటున్నారు. అంటే తొలుత చెప్పినట్లు ఈ సినిమా కోసం బాలయ్య మెగా ఫోన్ పట్టడం లేదు. ఎందుకు అనేది ఆయనే చెప్పాలి.
అన్నట్లు ఇదే సినిమాలో నందమూరి కొత్త తరం వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పుడు క్రిష్ ఏమన్నా ఆ ప్రయత్నం చేస్తారేమో చూడాలి.