సితార నాగవంశీ.. టాలీవుడ్‌లో వరుస సినిమాలు తీస్తున్న నిర్మాతల్లో ఒకరు. చిన్న హీరో, పెద్ద హీరో అనే లెక్క లేకుండా ఓ కథ నచ్చితే సినిమా నిర్మించడానికి ముందుకొస్తున్నారు. అలాగే హీరోలందరికీ దగ్గరగా ఉంటారు. వారి సినిమాలు విజయం సాధిస్తే ఆయన కూడా ఆనందపడతారు. అయితే తారక్ అంటే ప్రత్యేకమైన అభిమానం అనుకోండి. సినిమా ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకోకుండా రిలీజ్ హక్కులు కొనేసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఈ మాట ఆయనే చెప్పారు లెండి. ఒకవేళ సినిమా బాగుంటే వసూళ్ల ఫేక్ పోస్టర్లు వేసి జనాల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ మాట కూడా ఆయనే చెప్పారులెండి.
ఆ విషయం పక్కన పెడితే మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్‌తో మాత్రమే సినిమాలు చేశారు. ఆయనకున్న పరిచయాలకు చిరంజీవి, రామ్‌చరణ్‌తో సినిమాలు నిర్మించడం పెద్ద విషయం కాదు. అయితే ఏమో కానీ ఆయనకు ఇంకా ఏ ప్రాజెక్ట్ కూడా ఓకే అవ్వడం లేదు. అలా సినిమాలు సెట్ అవ్వడం లేదని.. మెగా ఫ్యామిలీ సినిమా రిలీజ్ డేట్లలో, వాటికి దగ్గర సినిమాలు రిలీజ్ చేస్తున్నారా? ఏమో ఆయన సినిమాల రిలీజ్ డేట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దీంతో ఇది కాకతాళీయమా? లేక ప్లానింగా? అనేది అర్థం కావడం లేదు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎప్పుడూ సినిమాలు నిర్మాణంలో ఉంటూనే ఉంటాయి. అలా ఒక్కోసారి ఆరేడి సినిమాలు సెట్స్ మీద కనిపిస్తాయి. అలా అన్నింటి మధ్య షూటింగ్ జరుపుకుని విడుదలకు సిద్ధమైన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను 2026 సంక్రాంతి పండగని టార్గెట్ చేసి జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. అదే సీజన్‌లో మెగాస్టర్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే జోనర్‌లో ఉండనున్నాయి.

ఇక విశ్వక్ సేన్, అనుదీప్ సినిమా ‘ఫంకీ’ని ఏప్రిల్ 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి కేవలం వారం ముందు అంటే మార్చి 27న రామ్ చరణ్ – జాన్వీ కపూర్ – బుచ్చిబాబు సానా ‘పెద్ది’ సినిమా వస్తుంది. అంటే గ్యాప్ ఓ వారమే. ఆ సినిమాకు ఉన్న హైప్ చూస్తే.. ఓ వారంలో చిన్న సినిమాను తీసుకురావడం పెద్ద రిస్కే. మరి ఇలాంటి రిస్క్ నాగవంశీ ఎందుకు చేస్తున్నట్లు?
