ఓటమి ఎప్పుడూ అంతం కాదు… ఆ తర్వాత కూడా జీవితం చాలా ఉంటుంది. అది మన ఓటమి అయినా, మనవాళ్ల ఓటమి అయినా. మన పెద్దలు ఈ మాటను చాలా రోజుల నుండి చెబుతూనే ఉన్నారు. అయితే టాలీవుడ్ అభిమానుల్లో కొందరు మాత్రం… ‘ప్రకాశ్‌రాజ్ ఓటమి’… ఏకంగా చిరంజీవి కుటుంబం పేరుకు అంతం పడినట్లే అని చెబుతున్నారు. నెటిజన్లలో ఓ వర్గం చేస్తున్న ఈ ప్రచారం ఎంతవరకు నిజం, ఆ ఓటమి… అంత ప్రభావం చూపిస్తుందా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్నప్పడల్లా ఓ ఆనవాయితీ ఉంటూ వస్తోంది. చిరంజీవి కటుంబం తమకు నచ్చిన వ్యక్తిని సపోర్టు చేస్తూ వచ్చింది. అలా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు సపోర్టు చేసింది. అయితే ‘మా’ సభ్యులు ఆయన్ను కాకుండా… మంచు విష్ణును నమ్మారు. అందుకే మెజారిటీ పోస్టులు వారికే కట్టబెట్టారు. దీంతోపాటు ప్రకాశ్‌రాజ్ కూడా ఓడిపోయారు. అలా ఎంత కాదన్నా చిరంజీవి కూడా ఓడినట్లే. అయితే టాలీవుడ్‌లో చిరంజీవి పని అయిపోయినట్లు కాదనేది గుర్తించాలి.
కానీ… సోషల్ మీడియాలో, రెగ్యులర్ మీడియాలోని ఓ వర్గంలో అయితే లెక్కలు వేరేగా ఉన్నాయి. టాలీవుడ్‌పై చిరంజీవి పట్టు కోల్పోయారు అంటూ ఊదరగొడుతున్నారు. నిజానికి ఈ ఓటమి చిరంజీవి వర్గాన్ని బాధపెట్టేదే కానీ దూరం చేసేది కాదు. అయితే #endofmega అని ట్రెండింగ్ చేసేంత కాదు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు కష్టం అనగానే… కొణిదెల కుటుంబం తలుపులు తెరుచుకునేవి. ఇప్పుడు ఆ అవకాశం మంచు కుటుంబం ముందుకు రాలి. ఒకవేళ అదే జరిగితే… చిరంజీవి ఏమీ చేయకుండా ఉండిపోతే కొందరు అన్నట్లు మెగాయిజం ఆగిపోయినట్లు. మరి మీరేమంటారు?