భక్త ‘కన్నప్ప’ ఎన్నో కష్టాలు పడ్డాక.. శివయ్య ప్రత్యక్షమై అనుగ్రహించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ‘భక్త కన్నప్ప’ సినిమాలో మనం ఈ విషయాలు అన్నీ చూశాం. అయితే ఆ కథను మరోసారి తెలుగు ప్రేక్షకులకు అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తుంటే పాపం అనిపించకమానదు ‘కన్నప్ప’ (Kannappa) చరితను వెండితెరపై మరోసారి ఆవిష్కరించడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు సినిమా రెడీ అయింది అనగా ఏదో సమస్య వచ్చి పడుతోంది.
దీంతో ‘కన్నప్ప’ వస్తాడా? తెస్తారా అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. వరుస వాయిదాల తర్వాత జూన్ 27న ‘కన్నప్ప’ సినిమాను విడుదల చేయాలని మంచు విష్ణు (Manchu Vishnu) ప్లాన్ చేశారు. స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా ఫుటేజీ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా ఓ వ్యక్తి తీసుకెళ్లారని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే సినిమా బ్యానర్‌లో రెడ్డి విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
కొరియర్ ద్వారా వచ్చిన హార్డ్ డ్రైవ్‌ను ఆఫీసు బాయ్ తీసుకెళ్లిపోయాడు అని ఆయన ఫిర్యాదు సారాంశం. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ ముంబయిలోని HIVE స్టూడియోస్ నుండి కొరియర్ ద్వారా ఫిల్మ్‌నగర్‌లోని విజయ్ కుమార్ కార్యాలయానికి వచ్చింది. ఆ పార్శిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మరో మహిళకు ఇచ్చాడు. అప్పటి నుండి ఇద్దరూ కనిపించడం లేదు.
సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు ఉండటంతో వారిని పట్టుకొని డ్రైవ్‌ను రికవరీ చేసే అవకాశం ఉంది. అయితే వరస్ట్ కేసులో డ్రైవ్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి? అనేదే ప్రశ్న. అయితే డేటా బ్యాకప్ ఉంటుంది కాబట్టి.. ఇబ్బందేం ఉండు. ఒకవేళ లేకపోతే మాత్రం జూన్ 27కి సినిమా రావడం కష్టమే అని చెప్పాలి. అయితే అన్నీ ప్లాన్డ్‌గా చేసే మంచు విష్ణు ఈ డ్రైవ్ విషయంలో ఇలా ఎందుకు చేశారో మరి. ఇప్పుడిలా జరిగిన నేపథ్యంలో జాగ్రత్తపడతారు.