బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందిన సంచలన సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా ఈ నెల 5న (డిసెంబర్ 5న) విడుదలకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈపాటికి సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. కానీ ఊహించని విధంగా ఈ మూవీ ఫైనాన్సియల్ సమస్యలతో రిలీజ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. ఈ విషయంపై నిర్మాతల పట్ల బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
‘అఖండ 2’ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ వారు ప్రొడ్యూస్ చేసిన విషయం తెల్సిందే. అయితే వీరు గతంలో మహేష్ బాబు హీరోగా ‘1 నేనొక్కడినే’ , ‘ఆగడు’ చిత్రాలు నిర్మించటం ఆ చిత్రాలకు సంబందించిన లావాదేవీలపై ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు వీరు కొంత మొత్తంలో బాకీ పడటంతో ఇరువురు సంస్థలు ఒక అగ్రిమెంట్ కి రావటం జరిగిందంట. కానీ అనుకున్న సమయానికి బకాయిలు తిరిగి చెల్లించకపోగా వాటికి వడ్డీ కూడా కలవటం, ఇవన్నీ అఖండ 2 రిలీజ్ కి అడ్డుగా మారాయి.

‘అఖండ 2’ ను ఈ నెల 12నే విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తుండగా, అయితే మూవీ యూనిట్ మాత్రం డిసెంబర్ 25 రిలీజ్‌కి ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు టాక్. 12న రిలీజ్ చేస్తే, వెంటనే వచ్చే వారంలో ‘అవతార్–3’ విడుదల ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం పడొచ్చని యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈరోస్ సంస్థతో ఉన్న వివాదంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతే అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
