సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పెద్దింటల్లుడు. శ్రీఅన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టి ఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా నగ్మా పరిచయం అయింది. ఈ సినిమా సక్సెస్ తరువాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. సుమన్ హీరోగా ఓ వైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరో కీ రోల్ పోషించారు. సీనియర్ నటి వాణిశ్రీ మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నపెద్దింటల్లుడు సకుటుంబ సపరివారసమేతంగా చూడదగ్గ చిత్రంగా మంచి కథ, కథనాలతోపాటు కామెడీ ప్రధానాంశంగా సాగుతుంది. ఈ సినిమా విడుదలై ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర కథానాయకుడు సుమన్ మాట్లాడుతూ .. పెద్దింటల్లుడు సినిమా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా నాకు చాలా వెరైటీ సినిమా. ఎందుకంటే ఇందులో ఓల్డ్ గెటప్ వేయడం…మోహన్ బాబు గారి కాంబినేషన్ లో చేయడం.. వాణిశ్రీ గారితో.. ఇలా నాకు చాలా కొత్త అనుభూతి ఇచ్చిన సినిమా. ఇది తమిళ్ లో నడిగర్ అనే సినిమాకు రీమేక్. పి వాసుగారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాన్నీ శరత్ గారి దర్శకత్వంలో తెలుగులో చేయడం. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. పైగా నాకు మంచి పేరు కూడా వచ్చింది. థాంక్స్ అన్నయ్య కాట్రగడ్డ ప్రసాద్ గారికి, శరత్ గారికి, అలాగే అందరికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో నేను కామెడీ కూడా చేయగలడు అని నిరూపించింది. అలా వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చిన సినిమా ఇది. వాణిశ్రీ గారికి, మోహన్ బాబు గారికి అందరికి థాంక్స్ చెప్పాలి, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు అయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అన్నారు.
సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ … 30 సంవత్సరాల క్రితం మా పెద్దింటల్లుడు విడుదలై అయ్యి ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అందుకు కారణమైన అందరి గుర్తుచేసుకోవాలి. ఇది సత్యరాజ్ హీరోగా తమిళంలో నడి గన్ అనే పేరుతో విడుదలైంది. ఈ హక్కులు నేను తీసుకుని సుమన్ గారితో చేయాలనీ అనుకున్నాను. అల్లుడు గారు సినిమా సిల్వర్ జూబిలీ ఫంక్షన్ లో మోహన్ బాబు గారు నన్ను పిలిచి ఈ సినిమాలో నేను ప్రత్యేక పాత్ర చేస్తానని చెప్పి నాకు అఫర్ ఇచ్చారు. అది నాకు జాక్ పాటు లాగా మారి ఆనందంగా సినిమా మొదలెట్టాను. అలాగే మా శ్రీఅన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ కు కాంపౌండ్ హీరో తమ్ముడు సుమన్ తో తీసాం.
ఈ సినిమాలో మరో ప్రముఖ పాత్ర కోసం ప్రముఖ నటి వాణిశ్రీ గారిని అడిగితే .. నేను తమిళ్ నడి గన్ సినిమా చూస్తా అని చెప్పారు. ఆ సినిమా చూసి ఈ పాత్ర చేసారు. అలాగే ఈ సినిమాతో హీరోయిన్ గా సౌత్ పరిశ్రమకు నగ్మా ను హీరోయిన్ గా పరిచయం చేసాం. అలాగే శరత్ దర్శకత్వంలో మూడు సినిమాలు చేశాను. కాలేజీ బుల్లోడు, అత్తా కోడలు, పెద్దింటల్లుడు మూడు సినిమాలు చేసి సూపర్ హిట్ విజయాలు అందుకున్నాము. ఈ చిత్రాన్ని అనుకున్న ప్రకారం పూర్తీ చేసి విడుదల చేసాం. అది పెద్ద విజయం సాధించి ,ఆ బ్యానర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మా సంస్థ కు పర్మినెంట్ హీరో గా ఉన్న తమ్ముడు సుమన్ గారికి, మోహన్ బాబు గారికి, వాణి శ్రీ గారికి, నగ్మా గారికి, శరత్ గారికి, రాజ్ కోటి గారికిఇలా ఈ టీం అందరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కథను నాకు ఇచ్చి ప్రోత్సహించిన పి. వాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.