స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు పెడతారా? ఆయన నిజంగా కొవిడ్ 19 నిబంధనలు ఉల్లఘించరా? అని అటు అభిమానులు, ఇటు సినిమా వర్గాలలో ఒక చర్చ మొదలైంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల కుంటాల జలపాతాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి సమీపంలో గల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్ళారు. ఆయన పర్యటన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనను చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు అమితాసక్తి చూపించారు.
అల్లు అర్జున్ పర్యటనపై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పర్యటనలో కొవిడ్ నిబంధనలు ఉల్లఘించారని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండి పోలీస్ స్టేషనులో కంప్లయింట్ చేశారని సమాచారం. కరోనా నేపథ్యంలో కుంటాల జలపాతం సందర్శనకు అధికారులు అనుమతించడం లేదనీ, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అల్లు అర్జున్ పర్యటించారనీ, అందుకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ప్రాధమిక విచారణ చేసిన అనంతరం కేసు నమోదు చేస్తామని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులకు తెలియజేశారట.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా లొకేషన్లను చూడటానికి కుంటాల వెళ్లినట్టు అందరూ అనుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా యాక్ట్ చేయనున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.