ఇండియన్ మ్యూజిక్ టాలెంట్‌ను ప్రపంచ వేదికల మీదకు తీసుకెళ్లిన సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) ఒకరు. చాలామంది ఈ ప్రయత్నం చేసినా.. ఆయన ప్రయత్నం ఎప్పటికీ మనకు గర్వకారణమే. అలాగే దేశంలో గర్వించే సందర్భాల్లో ఆయన పాటల్లో ఓ రెండు కచ్చితంగా ప్లే అవుతాయి. జాతీయ గీతాల తర్వాత మన దేశం గురించి వినిపించే పాటలు ఆ రెండు. అవే ‘మా తుఝే సలామ్’, ‘జై హో’. ఈ రెండు పాటల గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది.
ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచినా, మన కుర్రాళ్లు హాకీ మ్యాచ్ గెలిచినా ఈ పాటలు కచ్చితంగా ప్లే అవుతాయి. అయితే ఈ రెండూ హిందీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పాట ఒకటి తెలుగులో సిద్ధం చేస్తున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాలోనే ఈ పాట ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ట్యూన్ కూడా రెడీ అయిందట.
రామ్‌చరణ్ – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కుస్తీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ వస్తున్నారు అని తెలియగానే ఆయన ఎందుకు? సినిమాలో అంత స్పెషలేంటి అని అనుకున్నారంతా. మరికొందరైతే సినిమా మొదలయ్యాక, ఆయన ఉన్నాక చూద్దాం అనుకున్నారు. ఆయన ఉన్నారు, నాలుగు పాటల ట్యూన్స్ కూడా ఎప్పుడో ఇచ్చేశారు.
అయితే, ఈ సినిమా క్రీడా నేపథ్యంలో ఉండటంతో ఓ జాతీయ భావాన్ని రగిల్చే గీతం అవసరమని, దానికి రెహమాన్ అయితే కరెక్ట్‌గా సరిపోతారు అని టీమ్ భావించడం వల్లే ఆయన వచ్చారని సమాచారం. సినిమాలో రామ్‌చరణ్ శిక్షణలో బరిలోకి దిగిన కుస్తీ పోటీదారులు విజయం సాధించాక ఆ పాట ఉంటుందట. ‘చక్ దే ఇండియా’ సినిమాలోని టైటిల్ సాంగ్‌లా ఈ పాట ఉంటుంది అని చెబుతున్నారు.