ఆమిర్ ఖాన్‌ని అందరూ మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటారు. ఎందుకో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవును… మరోసారి గుర్తు చేసుకుంటే తప్పేముంది. అతని గొప్పతనం గురించి పదే పదే చెప్పుకుంటే మంచిదే కదా. కొంతమందికి ఆయన డెడికేషన్ స్ఫూర్తిగా కూడా ఉంటుంది. ఆమిర్ సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడనేది అందరికీ తెలిసిందే. ‘దంగల్’ టైమ్ బాడీని ఫిట్ చేసి మళ్లీ లూజ్ చేసి, మళ్లీ లూజ్ చేసిన పర్‌ఫెక్షనిస్ట్ అతను. ఇప్పుడు చెబుతోంది ‘పీకే’ సినిమా గురించి.
‘పీకే’ సినిమాలో ఆమిర్ చాలా సన్నివేశాల్లో కిళ్లీలు నములుతూ కనిపిస్తాడు. ఏముంది నోట్లో కిళ్లీ ఉన్నట్లు నమిలితే సరిపోతుంది అనుకుంటున్నారు. అలా చేస్తే ఆమిర్ ఖాన్ ఎందుకవుతాడు. సీన్ పర్‌పెక్షన్ కోసం ఏకంగా సినిమా టైమ్‌లో పది వేల కిళ్లీలు తిన్నాడట. నోరు ఎర్రగా పండినట్లు కనిపించాలంటే పెదాలకు రంగేసుకుంటే సరిపోతుంది అనుకోకుండా కిళ్లీలు నములుతూ సీన్స్ పండించాడు. ఇదే విషయాన్ని ఓసారి బాలీవుడ్ మీడియా ఆమిర్ ఖాన్ దగ్గర ప్రస్తావించిందట.
దానికి ఆయన చెప్పిన సమాధానం అక్కడ నవ్వులు పూయిస్తే, యువ నటులకు స్ఫూర్తినిచ్చింది. “షూటింగ్‌లో ఒక్కోసారి రోజుకు 100 కిళ్లీలు వరకు నమలాల్సి వచ్చేది. దీంతో కావలసినప్పుడల్లా కిళ్లీలు కట్టడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకున్నాం. అతను పూర్తి సరంజామాతో సెట్‌లో ఉండేవాడు. షూటింగ్ మొదలయ్యేలోగా నోరు, పెదాల రంగు ఎర్రగా మారడానికి ఒక్కోసారి 10 నుంచి 15 కిళ్లీలు నమిలేవాణ్ని’’ అని చెప్పాడు ఆమిర్.