ప్రతి హీరోకీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌లు, డిజాస్టర్‌లు ఉంటాయి. అవి లేని హీరోలు చాలా తక్కువే అని చెప్పాలి. అయితే విజయం గుర్తున్న రోజులు కంటే పరాజయమే ఎక్కువగా గుర్తుంటుంది అంటుంటారు. హీరో సంగతేమో కానీ.. ఆ హీరో అభిమానులకు మాత్రం ఇంకా ఎక్కువే గుర్తుంటుంది. అలా చిరంజీవి అభిమానులకు బాగా గుర్తుండిపోయే సినిమా ‘ఆచార్య’ అని చెప్పాలి. రామ్‌చరణ్‌కి అయితే ఇంకా కొన్ని అలాంటి సినిమాలున్నాయి అనుకోండి. అయితే ‘ఆచార్య’ టీవీ హక్కుల విషయంలో కొత్త చర్చ వినిపిస్తోంది.
‘ఆచార్య’ టీవీ టెలీకాస్ట్ హక్కుల ధర విషయంలో సినిమా నిర్మాత, జెమినీ టీవీ ఛానల్ మధ్య ఓ చర్చ నడుస్తున్న వార్తలు చదివే ఉంటారు. సినిమాకు తొలుత రూ. 15 కోట్లు ఇవ్వడానికి జెమినీ టీవీ ఓకే అందని, అయితే ఇప్పుడు రూ. ఏడున్నర కోట్లే ఇవ్వడానికి ముందుకొస్తోందని ఆ వార్తల సారాంశం. సినిమాలో కాజల్ లేకపోవడం వల్లే అంత తగ్గిస్తున్నారు అనే మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా టీవీల్లో వస్తుందా అనే ప్రశ్న మొదలైంది.
ఒకవేళ ఈ డీల్ కాకపోయి, వేరే ఎవరూ ముందుకు రాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చిరంజీవి సినిమా ఒకటే అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సినిమాలు ఇలా డీల్ కుదరక టీవీల్లోకి రాలేదు. అలాంటివాటిలో నందమూరి బాలకృష్ణ ‘పరమవీరచక్ర’ కూడా ఉంది. ఆ సినిమా టీవీ డీల్ కుదరక, అలాగే ఎవరూ ముందుకు రాక టీవీల్లో ఆ సినిమా టెలీకాస్ట్ అవ్వడం లేదు. మరి బాలయ్యకు తోడుగా చిరంజీవి ఉంటాడా? లేక లెక్కలు తేల్చుకుని ముందుకొస్తాడా అనేది చూడాలి.
బాలకృష్ణ ‘పరమవీరచక్ర’ 2011లో విడుదలయ్యింది. 11 ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు టీవీ టెలికాస్ట్ లేదు. అయితే ‘ఆచార్య’ విషయంలో అభిమానుల ఆలోచన వేరేలా ఉంది. అలాంటి కళాఖండం టీవీలో రాకపోయినా ఫర్వాలేదు అంటున్నారు. అయితే టీవీ రైట్స్ డబ్బులతో ఓ డిస్ట్రిబ్యూటర్ లెక్క తేల్చేయాలని చూస్తున్నరట. చూద్దాం టీవీ డీల్ ఏమవుతుందో?