సిమ్రాన్ ఒకప్పుడు టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఈమె ఖాతాలో ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహనాయుడు’ ‘కలిసుందాం రా’ వంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే ‘నరసింహనాయుడు’ తర్వాత ఈమె తెలుగులో నటించిన సినిమాల్లో ఒక్క ‘సీతయ్య’ తప్ప మరేమీ సక్సెస్ కాలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి చేసిన ‘ఒక్క మగాడు’ కూడా పెద్ద ప్లాప్ అయ్యింది.
దీంతో ఈమె తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈమె తెలుగులో నటించిన ఆఖరి చిత్రం ‘జాన్ అప్పారావు 40 ప్లస్’. ఆ తర్వాత ఈమెను తెలుగు మేకర్స్ ఎవ్వరూ అప్రోచ్ అవ్వలేదు.సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ ‘పేట’ ‘సీమరాజ’ వంటి డబ్బింగ్ చిత్రాలతో నేను ఉన్నాను అంటూ గుర్తు చేస్తూనే ఉన్నా వాళ్ళు ఈమెను పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఎలాగైనా తెలుగులో బిజీ కావాలని ఈమె ఓ డెసిషన్ తీసుకుంది.
ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ళ తర్వాత ఈమె ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వివరాల్లోకి వెళితే… ఆది పినిశెట్టి హీరోగా ‘శబ్దం’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘వైశాలి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఆది- దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఇది. ఇది ద్విభాషా చిత్రం.
తమిళ్ తో పాటు తెలుగులో కూడా రూపొందుతోంది. ‘శబ్దం’ మూవీలో సిమ్రాన్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. హీరోయిన్ లక్ష్మీ మీనన్ కంటే కూడా ఈ సినిమాలో సిమ్రాన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఆదికి తెలుగులో ఒకటి రెండు హిట్లు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాతో సిమ్రాన్ తిరిగి తెలుగులో బిజీ కావాలని భావిస్తుంది.