“మనం ద్వేషించేవారి తప్పులను క్షమించడం చాలా ఈజీ. కానీ, ప్రేమించేవాళ్ల తప్పులను క్షమించడం చాలా కష్టం” – ‘అమరం అఖిలం ప్రేమ’లో ఓ డైలాగ్. కష్టాన్ని దాటుకుని వచ్చి కన్నకూతురు చేసిన తప్పును తండ్రి క్షమించేలోపు ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాలి.
కథ: అఖిల (శివశక్తి సచ్‌దేవ్) అంటే ఆమె తండ్రికి ఎంతో ప్రేమ. కూతుర్ని విడిచి ఉండలేడు. అటువంటి తండ్రి, తనకు దూరంగా కుమార్తెను కాకినాడ నుండి హైదరాబాద్ ఎందుకు పంపించాడు? సీరియస్‌గా ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్న అఖిలను ప్రేమిస్తున్నాని అంటూ వెంటపడిన అమర్ (విజయ్ రామ్), చివరకు ఆమెకు ఏం నేర్పించాడు? ఆమె తండ్రికి ఏం తెలిసివచ్చేలా చేశాడు? అనేది సినిమా.
నటీనటుల పనితీరు: హీరో విజయ్ రామ్‌కి తొలి చిత్రమిది. మొదటి చిత్రంలో చెప్పుకోదగ్గ యాక్టింగ్ చేశాడు. అతడు హ్యాండ్సమ్‌గా ఉన్నాడని చెప్పడం కంటే క్యారెక్టర్‌కి తగ్గట్టుగా హ్యాండ్సమ్‌గా యాక్ట్ చేశాడని చెప్పవచ్చు. ‘మీతో జర్నీ చేయలేను’ అని అమ్మాయికి చెప్పిన తరవాత బస్ నుండి కిందకు దిగే ఎమోషనల్ సన్నివేశంలో విజయ్ రామ్ నటన బావుంది. సినిమా స్టార్టింగ్‌లో క్యారెక్టర్‌కి అవసరమైన రెక్లెస్‌నెస్ బాగా చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మరింత మెరుగవ్వాలి. క్యారెక్టర్‌కి అవసరమైన అమాయకత్వంతో పాటు, అందులోని భావోద్వేగాలను శివశక్తి సచ్‌దేవ్ అద్భుతంగా చూపించింది. హిందీలో సీరియళ్లు, షో చేసిన అనుభవంతో బాగా యాక్ట్ చేసింది. అందంగా కూడా కనిపించింది. తండ్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పర్ఫెక్ట్ యాప్ట్. వీకే నరేష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. అన్నపూర్ణమ్మకి అటువంటి క్యారెక్టర్ చేయడం అలవాటే. అయినా కథకు తగ్గట్టు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమా సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకునే తప్పకుండా నలుగురు గురించి మాట్లాడుకోవాలి. ఒకరు.. దర్శకుడు. రెండు… మాటల రచయిత. మూడు… సినిమాటోగ్రాఫర్. నాలుగు… సంగీత దర్శకుడు.
ముందు దర్శకుడు విషయానికి వస్తే… అతడి కథలో భావోద్వేగాలు బావున్నాయి. బలంగా ఉన్నాయి. తెరపైకి తీసుకొచ్చిన తీరు కూడా బావుంది. భావోద్వేగాల దగ్గరకు వచ్చేవరకూ చూపించిన ప్రేమకథలో కొత్తదనం లేదు. అమ్మాయిని చూడగానే అబ్బాయి ప్రేమించడం, వెంట పడటం పాత చింతకాయ పచ్చడిలా ఉంది. అమ్మాయి గతం తెలిసిన తరవాత అబ్బాయి ప్రవర్తించిన తీరు మనసులను తాకుతుంది. తండ్రి ప్రేమ కోసం అమ్మాయి పడుతున్న మనోవేదన, తండ్రి అమ్మాయిని దూరం చెయ్యకూడదని అబ్బాయి దూరం అవ్వడం వంటి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల కనురెప్పల అంచున చిన్న తడి తీసుకొస్తాయి. అక్కడక్కడా సినిమాలో కొంత మెలోడ్రామా ఎక్కువైందని అనిపిస్తూ ఉంటుంది.
దర్శకుడి ఊహకు మాటల రచయిత శ్రీకాంత్ నాయుడు విస్సా ప్రాణం పోసాడని చెప్పాలి. సన్నివేశాలకు తగ్గట్టు ‘విడిపోవడం సులువైనప్పుడు అది అసలు ప్రేమే కాదు’, ‘ఒక్కసారి ప్రేమ అనుకుని తప్పు చేశాను. అది ప్రేమ కాదని తెలిసేలోపు అన్నీ కోల్పోయాను’, ‘ప్రేమ అంటే బలహీనతలను కూడా ప్రేమించాలి ఎదుటివారి తప్పులను కూడా క్షమించాలి.’, ‘నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదంటారు. నిజమైన ప్రేమ భరిస్తుంది. సహిస్తుంది. క్షమిస్తుంది’ మంచి డైలాగులు రాశాడు. కథలో, సన్నివేశాల్లో డెప్త్ మాటల్లో వినిపించింది. సినిమాను అందమైన పెయింటింగ్ లా తన సినిమాటోగ్రఫీతో రసూల్ ఎల్లోర్ మారిస్తే… కథకు తగ్గట్టు పాటలను, నేపథ్య సంగీతాన్ని అందించాడు రధన్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ కూడా బావుండి ఉంటే మరింత బాగుండేది.
విశ్లేషణ: ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే… రెండు జీవితాలు – మూడు ప్రేమకథలు. హీరో అమర్, హీరోయిన్ అఖిల్… వాళ్ళిద్దరి జీవితాలను దర్శకుడు తెరపై చూపించాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమకథ ఒకటి అయితే, తండ్రీ కూతుళ్ళ మధ్య ప్రేమ కథ మరొకటి. ఇంకో ప్రేమకథ కథను మలుపు తిరుగుతుంది కాబట్టి చెప్పలేం! అల్లరి చిల్లరి ప్రేమ కథతో కాకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీశాడు దర్శకుడు జోనాథన్. నటీనటులు, సాంకేతిక వర్గం ప్రతిభ తోడవడంతో సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. ఓటీటీలలో అడల్ట్ కంటెంట్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చక్కటి సినిమా ‘అమరం అఖిలం ప్రేమ’. మంచి సినిమా చూడాలంటే అందులో కొన్ని తప్పులను భరించాలి. సహించాలి. క్షమించాలి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ భరిస్తే చాలా బాగుంటుంది.