వెంకటేష్ కెరీర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలలో సాహసవీరుడు సాగర కన్య ముందు వరుసలో ఉంటుంది. భారీ స్టార్ క్యాస్ట్ తో వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ మూవీని ఓ ఫాంటసీ స్టోరీగా తెరకెక్కించారు. సముద్రంలో జీవించే సాగర కన్య, మానవ యువకుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరక్కెక్కింది.
ఈ సాగర కన్య పాత్ర కోసం రాఘవేంద్ర రావు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టిని తెప్పించారు. అప్పటికే హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న శిల్పా శెట్టికి ఇది మొదటి తెలుగు చిత్రం . కీరవాణి ఈ మూవీ కోసం అందించిన సాంగ్స్ జనాలకు బాగా ఎక్కేశాయి. ఇక 1990లో చిరంజీవితో దర్శకేంద్రుడు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్. అదే జోనర్ లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
కైకాల సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు, శ్రీహరి,విజయలలిత వంటివారు ప్రధాన విలన్స్ గా నటించారు. కన్నడలో అప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న మాలాశ్రీని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. అనేక అంచనాల మధ్య ఈ చిత్రం 1996 ఫిబ్రవరి 9న విడుదలైంది. రాఘవేంద్ర రావు నుండి వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని మనసులో పెట్టుకొని వెళ్లిన ప్రేక్షకులకు ఈ మూవీ ఆ అనుభూతిని పంచలేక పోయింది. సినిమా గ్రాండ్ గా భారీ ఎత్తున తెరకెక్కినప్పటికీ, చిరు-శ్రీదేవిల మధ్య కుదిరిన కెమిస్ట్రీ వెంకీ-శిల్పాల విషయంలో వర్క్ అవుట్ కాలేదు. దీనితో ఎమోషనల్ గా ఈ మూవీకి ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు.