బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ… ఉన్నఫళంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. అదేంటి రీఎంట్రీ అనుకుంటున్నారా? గుర్తుంచుకోండి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లు, స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ అదరగొడుతోంది. నిడివి తక్కువున్న పాత్ర అయినా సరే తనదైన ముద్ర వేస్తోంది. దీంతో చాలామంది దర్శకులు ఆమె కోసం పాత్రలు రాస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆమె నటించిన సినిమా ‘థ్యాంక్ యూ బ్రదర్’. త్వరలో ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటికొచ్చింది.
‘థ్యాంక్‌యూ బ్రదర్’ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే తక్కువ మంది సిబ్బందితో తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే సినిమా ప్రచారం మొదలుపెట్టినా, పెద్ద సినిమాల మధ్యలో ఎందుకు అనుకున్నారో వాయిదా వేసుకుంటూ వచ్చారు. తీరా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక థియేటర్లు మళ్లీ బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీకి ఇచ్చేశారు. అయితే ఈ చిన్న సినిమాకు కూడా అనసూయకు పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్టజెప్పారట ఈ విషయమే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్.
‘థ్యాంక్ యూ బ్రదర్’ కోసం అనసూయ రోజువారీ పారితోషికం స్టైల్‌లో పని చేసిందట. ఒక్కో రోజుకు లక్షన్నర రూపాయలు వరకు వసూలు చేసిందట. అలా సినిమా కోసం 17 రోజులు కేటాయించిందట. అంటే మొత్తంగా ఆమెకు ₹25 లక్షలు వరకు తీసుకుందని అంటున్నారు. దీంతో కొత్త హీరోయిన్ల కంటే ఈమెకే ఎక్కువ వస్తోందన్నమాట. అన్నట్లు మొన్నీ మధ్య ‘చావుకబురు చల్లగా’లో ప్రత్యేక పాట చేసినందుకు కూడా భారీగానే అందుకుందట. ఆ సినిమా కోసం అనసూయకు ₹6 లక్షలు వరకు ఇచ్చారని టాక్.
రీఎంట్రీ అని అన్నారు.. మళ్లీ గుర్తు చేయమన్నారు అని అంటారా.. ఓకే ఓకే. అనసూయ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులైంది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి లక్ ట్రై చేసుకుంది. కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సినిమాలకు దూరమై యాంకరింగ్, న్యూస్‌ప్రజెంటర్ అంటూ టీవీల్లోకి వచ్చి, ‘జబర్దస్త్’తో హిట్ కొట్టి.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కావాలంటే ‘నాగ’ సినిమాలో ఓ సీన్‌లో సునీల్ పక్కన అనసూయను చూడొచ్చు.