పవన్ కల్యాణ్‌కు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి. ఆయన షూటింగ్ స్పాట్‌లో షాట్ గ్యాప్‌లో కూడా ఏదో పుస్తకంలో తల దూర్చేస్తారు అని అంటుంటారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆయనకు అసలు పుస్తకాలు చదివే అలవాటు ఎప్పుడు మొదలైంది. అది పుస్తకాల పిచ్చిగా ఎప్పుడు మారింది? ఈ విషయాలను ఆయన మాతృమూర్తి అంజనా దేవి ఇటీవల వివరించారు. జనసేన పార్టీ టీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
Pawan Kalyan
పవన్ కల్యాణ్ స్కూలులో ఎక్కువ చదవలేదట. ఆయన పదో తరగతికి వచ్చేసరికి చిరంజీవి క్లాస్‌మేట్‌కి లైబ్రరీ ఉండేటదట. దీంతో అక్కడికి వెళ్లి ఎక్కువగా చదువుకునేవాడట. ఎప్పుడైనా ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అంజనా దేవి అడిగితే ‘చదువుకోవడానికి’ అనేవాడట. అలా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది అని ఆమె చెప్పారు.
అంతేకాదు ఇప్పటికీ పవన్ కల్యాణ్ చాలా పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని చదువుతూనే ఉంటాడడని,. ఇంట్లో చూస్తే చాలా పుస్తకాలు ఉన్నాయని చెప్పిన ఆమె.. అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకుంటూ ఉంటాను అని చెప్పారు. మరి సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు కదా.. మీ ఫీలింగ్ ఏంటి అని అంటే.. ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్తాను, పార్టీ పెడతాను అని పవన్ చెప్పినప్పుడు.. పార్టీలు మనకెందుకు? సినిమాలు చేసుకుంటే బాగుండును కదా అని అంజనా దేవి అనుకున్నారట.
అయితే అది, ఇదీ రెండూ చేస్తానమ్మా అని పవన్ చెప్పాడట. దానికితోడు ఈ విషయంలో ఎప్పుడూ వాదించేదాన్ని కాదని ఆమె చెప్పారు. పిల్లలు పెద్దవాళ్లు అయిపోయారు కదా. వారి ఆలోచనలు వారికి ఉంటాయి అని ఆమె అన్నారు. పదేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి కష్టపడ్డారు పిల్లలు. ఇప్పుడు చిన్నోడు డిప్యూటీ సీఎంగా తన మార్క్ చూపిస్తున్నాడు అని అంజనా దేవి ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇదేకదా పుత్రోత్సాహం.