‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ సినిమా కథలో చాలా మార్పులు చేస్తున్నారని, ఆ సినిమా కోసం కొత్త నటుల్ని ఎంపిక చేసి కాస్టింగ్‌ను ఇంకాస్త స్ట్రాంగ్ చేస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో పై పుకార్లు నిజమే అని అనుకున్నారు కొంతమంది. అయితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు నిర్మత అశ్వనీదత్.
Aswani Dutt
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ విజయం అందుకున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది విడుదలైన ఈ సినిమా భారతీయ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సుమారు రూ.1100 కోట్లు వసూళ్లు కూడా అందుకుంది. అందుకే ఈ సినిమా రెండో పార్టు కోసం చాలా మార్పులు చేస్తున్నారని వార్తలొచ్చాయి. సినిమా కూడా లేట్ అవుతుంది అని అన్నారు.
అయితే అశ్వనీదత్ మాత్రం ‘కల్కి 2’ సినిమావచ్చే ఏడాది విడుదలవుతుంది అని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు గతంలో చెప్పినట్లు రెండో పార్ట్ మొత్తం కమల్ హాసనే ఉంటారని తెలిపారు. ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు అదిరిపోతాయి అని చెప్పారు. ఎప్పట్లాగే అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు. అలా మొత్తంగా ఈ మూడు పాత్రలే ఎక్కువగా తెరపై కనిపిస్తాయని చెప్పారు.
దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందన్నారు.రెండో పార్టులో కొత్త వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉందని అన్నారు. ఈ లెక్కన ముగ్గురు మెయిన్‌గా ఉండటం పక్కానే కానీ.. మరికొన్ని కొత్త పాత్రలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నాగ్ అశ్విన్ గురించి మాట్లాడుతూ.. ‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ సూపర్ హిట్‌గా నిలిచాయని, తన అల్లుడుకు జీవితంలో ఓటమనేది ఉండదని ఆశిస్తున్నా అని చెప్పారు.