నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.1991 జూలై 18న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టెక్నాలజీ లేని రోజుల్లోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు సింగీతం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని.. ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. సింగీతం శ్రీనివాస రావు కథను కూడా సిద్ధం చేశారట.
నిజానికి బాలకృష్ణ 100వ చిత్రంగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ ఉంటుందని టాక్ నడిచింది.కానీ బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ ను కావాలనే పక్కన పెట్టి.. క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం చేసినట్టు తెలుస్తుంది. ఓ యువ దర్శకుడితో ‘ఆదిత్య 369’ సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుందని బాలకృష్ణ ఇప్పటి వరకూ ఆగినట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. చాలా కాలం నుండీ బాలయ్యతో సినిమా చెయ్యాలని ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎదురుచూస్తున్నాడట.
రొటీన్ మాస్ సినిమాలు కాకుండా.. ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ కథతోనే బాలయ్యతో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడట. దాంతో ఇతనికే ‘ఆదిత్య 369’ సీక్వెల్ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలయ్య సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక ‘అ!’ చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ.. రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా చేసాడు. కానీ అది హిట్ అవ్వలేదు. అందులోనూ 60 ఏళ్ళ వయసులో బాలయ్య.. ‘ఆదిత్య 369’ పాత్రకి సెట్ అవుతాడా? అనేది మరో సందేహం. చూడాలి చివరికి ఏమవుతుందో…!