కొన్ని రోజుల క్రితం ప్రత్యేకహోదా పై టాలీవుడ్ సినీ పరిశ్రమ నోరువిప్పాలని టీడీపీ ఎమ్యెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో పోసాని కృష్ణమురళి పాల్గొని మాట్లాడుతుండగా.. అతని సమక్షంలో ఆ న్యూస్ ఛానల్ ఎడిటర్ టాలీవుడ్ నటీమణులను అసభ్యపదజాలంతో దూషించారు. ఎడిటర్ మాట తీరుపై టాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అంతటితో ఆగలేదు. టాలీవుడ్ హీరోయిన్ లు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. హీరోయిన్స్ గురించి చీప్ గా మాట్లాడిన వారిని అంత ఈజీగా వదలమని మంచు లక్ష్మి ప్రసన్న హెచ్చరించారు. ఆమె సోదరుడు మంచు మనోజ్ కూడా “అతడు కనిపిస్తే పళ్లు రాల గోడతా.. మీరు కూడా అలానే చేయండి” అంటూ అభిమానులకు చెప్పారు.
” మీడియా సంస్థల్లో ఉన్నప్పుడు తమ పెన్నుతో మంచి విషయాలు రాయాలి, చెప్పాలి. అంతే తప్ప. పెన్ను ఉంది కదా.. అని దానిని కత్తిలా భావించి ఎవరిపై పడితే వారిపై విసరకూడదు” అని మెహ్రీన్ స్ట్రాంగ్ గా చెప్పింది. రకుల్ కూడా ఘాటుగానే స్పందించింది. “జర్నలిస్టు అని చెప్పుకోవడాని అతను సిగ్గుపడాలి. నటీనటులను టార్గెట్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ, చర్చల పేరుతో ఇలా లాభాలను పొందుతున్నారు. నిజంగా ఇది దారుణమైన పరిణామం” అని ట్వీట్ చేశారు. లావణ్య త్రిపాఠి కూడా స్పందించింది. “ఈ ఒక్క విషయంపై మాట్లాడడం లేదు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. సిగ్గుపడాల్సిన చండాలమైన విషయం. మహిళల్ని అవమానించే విధంగా కొందరు ఇలాంటి దారులను ఎంచుకున్నారు” అని ట్వీట్ చేశారు. సినీ పరిశ్రమ వారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారిని కట్టడి చేయాలంటే ఇలా సినీ స్టార్స్ ఒక్కటి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.